ఏపీలో విజృంభిస్తున్న డయేరియా...

ఏపీలో విజృంభిస్తున్న డయేరియా...

ఏపీలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే విజయవాడ, కాకినాడ, గోదావరి జిల్లాల్లో వ్యాపించిన డయేరియా.. ఇప్పుడు కడప జిల్లాకు కూడా వ్యాపిస్తోంది. కడప జిల్లా మిడితురులో డయేరియా కారణంగా ఒకరు మృతి చెందగా, 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.మరో 20మంది పరిస్థితి విషమంగా మారటంతో ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 20మందికి చికిత్స అందిస్తున్నారు.

బాధితులు గత రెండురోజులుగా వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతుండగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవటంతో ప్రొద్దుటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.నీటి కాలుష్యమే డయేరియా విజృంభణకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వైద్యశాఖా అధికారులు మిడితురు గ్రామాన్ని సందర్శించారు.

డయేరియాపై గ్రామా ప్రజలకు అవగాహన కల్పించారు వైద్యశాఖ అధికారులు. డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. మరోపక్క పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలో కూడా డయేరియా విజృంభిస్తోంది 3రోజుల్లో 20కి పైగా అతిసార కేసులు నమోదు కాగా ఇప్పటిదాకా 4మృతి చెందారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పడకేసిందని, ఆరోగ్యశాఖ నిద్రమత్తులో జోగుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.