ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన : చాడ వెంకట్ రెడ్డి

హనుమకొండ జిల్లా: ప్రజాస్వామ్య ముసుగులో మతోన్మాదం, నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయని, భవిష్యత్తులో మన దేశంలో కూడా పార్టీని పునరేకీకరణ చేస్తామన్నారు. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలతో  దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కంకణ బద్ధులమవుతామని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చాడ వెంకట్ రెడ్డి దేశంలో రాజరిక వ్యవస్థ అంతం కావాలని,  ప్రజాస్వామ్యం రావాలని 550 సంస్థానాల్లో పోరాటం చేసిందన్నారు. 

 స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల త్యాగాలు వెలకట్టలేనివని చాడ వెంకట్ రెడ్డి అన్నారు దేశానికి స్వాతంత్య్రం వచ్చినా  ప్రజాస్వామ్య ముసుగులో మళ్లీ మతోన్మాద నియంతృత్వ పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం తిరోగమనం వైపు పయనిస్తోందని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ప్రైవేటీకరణ ను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ప్రజా భక్షకులు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారని, ప్రజా రక్షకులు, సేవకులు కనుమరుగవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పునరేకీకరణ కోసం కమ్యూనిస్టు పార్టీ రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తుందని, మార్క్సిజం, లెనినిజాన్ని మించిన సిద్ధాంతం లేదని చాడ వెంకట్ రెడ్డి వివరించారు.