నవ్వు.. ఆరోగ్యానికి మంచిది! కానీ.. సమయం, సందర్భం లేకుండా నవ్వితే దాని పర్యవసనాలు వేరేగా ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ కమలా హారిస్ ఓటమి. అధ్యక్ష ఎన్నికల ర్యాలీల్లో కమలా హారిస్ పగలబడి నవ్వేవారు. కామెడీ సందర్భాల్లోనే కాదు సీరియస్ విషయాల్లోనూ ఆమె అదే తీరుగా నవ్వేవారు. దీన్నే రిపబ్లికన్స్ అస్త్రంగా మార్చుకున్నారు. ‘‘ఆమె నవ్వును 20 సెకండ్లు కూడా భరించలేం. అలాంటిది నాలుగేండ్లు భరించగలమా?” అని క్యాంపెయిన్ నడిపించారు. అర్థం పర్థం లేకుండా కమలా హారిస్ నవ్వుతున్నారంటూ వీడియోలను వైరల్ చేశారు. ఇందుకు కొన్ని సంఘటనలను కూడా కోట్ చేశారు.
2022లో ఉక్రెయిన్ శరణార్థుల పరిస్థితి గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె పగలపడినవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదొక్కటే కాదు పలు సున్నిత అంశాల్లోనూ కమల తీరు ఇలాగా ఉంటున్నదని, జనం బాధల్లో ఉంటే ఆమెకు నవ్వు ఎట్ల వస్తుందని ప్రశ్నిస్తూ జనంలోకి రిపబ్లికన్స్ వెళ్లారు. వాస్తవానికి.. జనానికి కమలా హారిస్ పరిచయమైంది కూడా ఇలాంటి నవ్వుతోనే. 2020లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ‘‘జో.. మనం గెలిచేశాం” అంటూ వేదికపైనే ఆమె పగలపడి నవ్వేశారు. అప్పటి నుంచి కమలా హారిస్ నవ్వు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడమే కాదు ట్రోల్ అవుతూనే ఉంది. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఓటమికి నవ్వు ఒక కారణమైందట!