
ముంబై: రెండు దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), శివసేన (యూబీటీ)లు త్వరలో కలిసి పని చేయనున్నాయనే వార్తలు వెలువడుతుండటంతో బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే సెటైర్ వేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రకటనపై స్పందించే ముందు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన భార్య రష్మి అనుమతి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.
మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి పని చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇటీవల రాజ్ ఠాక్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నితీశ్ రాణే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడారు. ‘‘రాజ్, ఉద్ధవ్ ఠాక్రేల మధ్య పెద్దగా విభేదాలు లేవు. అయితే శివసేన నుంచి రాజ్ ఠాక్రే బయటకు వెళ్లడం వెనక రష్మీ ఠాక్రేదే కీలక పాత్ర. ఎంఎన్ఎస్ తో చేతులు కలపడానికి ముందు రష్మి అనుమతి తీసుకున్నారా అని ఉద్ధవ్‌ను మీరు ప్రశ్నించాలి” అని ఆయన పేర్కొన్నారు.