పంజాబ్ సీఎంగా తాను చేయాల్సినంత మంచి చేశానని కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న పంజాబ్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డీల్ చేశానని అన్నారు. ఈ విషయాలను తెలియజేస్తూ ఆయన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. అంతర్గత భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు ప్రజల మధ్య మతసామరస్యాన్ని కాపాడడంలో సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని ఆ లెటర్‌లో కెప్టెన్ పేర్కొన్నారు. పారదర్శక పాలనను అందిచానని, రాజకీయంగా నైతిక విలువలను పాటించామని తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్‌లో ఉన్న 13 ఎంపీ సీట్లలో 8 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పరిపక్వతతో కూడిన నిర్ణయాలను తీసుకుంటుందని పంజాబ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని అమరీందర్ చెప్పారు. మంచి రాజకీయ విధానాలతో పాటు సామాన్యుల ఆకాంక్షలను కూడా పట్టించుకునేలా పాలసీలు ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో శాంతి సామరస్యాలు దెబ్బ తినకుండా చూడాలని, అభివృద్ధి కొనసాగేలా దృష్టి పెట్టాలని తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి కోరుతున్నానని చెప్పారు.