ప్రతిపక్షనాయకుడను.. వారం రోజులుగా నాకు మైక్ ఇవ్వలేదు..లోక్సభ స్పీకర్పై రాహుల్ తీవ్ర ఆరోపణలు

ప్రతిపక్షనాయకుడను.. వారం రోజులుగా నాకు మైక్ ఇవ్వలేదు..లోక్సభ స్పీకర్పై రాహుల్ తీవ్ర ఆరోపణలు

లోకసభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. గత వారం రోజులుగా అనేకల సమస్యలపై లేవనెత్తేందుకు పదేపదే మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని అన్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇది సభను నడిపే విధానం కాదు అంటూ లోక్ సభా స్పీకర్ ఓం బిర్లాపై తీవ్ర విమర్శలు చేశారు. 

బుధవారం (మార్చి26) పార్లమెంట్ ముందు విలేకరులతో మాట్లాడిన రాహుల్..లోక్సభలో అప్రజాస్వామ్య పద్దతిలో నడిపిస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా కీలకఅంశాలను లేవనెత్తాలని తాను పదేపదే అభ్యర్థించినప్పటికీ స్పీకర్ తోసిపుచ్చారని అన్నారు. ‘‘మహాకుంభమేళా, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై మాట్లాడేందుకు ప్రయత్నించాను..సభకు ఎలాంటి ఆటంకం కలిగించనప్పటికీ.. నేను లేచి నిలబడి అడిగినప్పుడల్లా స్పీకర్ అడ్డుకున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోయిందని’’ రాహుల్ అన్నారు. 

ALSO READ | హద్దు మీరితే అనుభవించాల్సిందే.. కమెడియన్ కమ్రా వ్యాఖ్యలపై ఏక్​నాథ్​ షిండే స్పందన

సభ గౌరవాన్ని కాపాడటానికి సభ్యులు పాటించాల్సిన విధాన నియమాలను పాటించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరిన తర్వాత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఆ పరిశీలన చేయడానికి గల కారణం ఏమిటో వెంటనే స్పష్టంగా తెలియలేదన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేశారని రాహుల్ గాంధీ అన్నారు. 

లోక్‌సభ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, లోక్‌సభలో పార్టీ విప్ మాణికం ఠాగూర్ సహా దాదాపు 70 మంది కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం నిరాకరించడంపై లేవనెత్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.