పెద్దపల్లి /రామగిరి, వెలుగు: గత పదేండ్లలో సింగరేణిలో కాంట్రాక్ట్, డిపెండెంట్ఉద్యోగాలు లంచాలు తీసుకోకుండా నిరుద్యోగులకు ఇచ్చినట్టు చెప్పగలరా? అని బీఆర్ఎస్ లీడర్లను పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నిలదీశారు. ఎవరికైనా నిజాయతీగా ఉద్యోగాలు వచ్చినట్టు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలరా? అని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా రామగిరిలో సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థానిక కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వంశీకృష్ణ పాల్గొన్నారు. మండలానికి చెందిన వివిధ పార్టీలు, సంఘాల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ఎన్నికలు అభివృద్ధిని నమ్ముకున్న కాంగ్రెస్, అహంకారంతో రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు మధ్య సాగుతున్నాయని అన్నారు. అన్ని పార్టీలు, సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాయని, దేశవ్యాప్తంగా మెజార్టీ సాధించి రాహుల్‌గాంధీ కచ్చితంగా ప్రధాని అవుతారని తెలిపారు.
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. అందరూ ఒక్కతాటిపై ఉంటే ఏదైనా సాధించవచ్చని, అందరం ఒక్కటిగా ఉన్నాం కాబట్టే తెలంగాణ సాధించగలిగామని చెప్పారు. తెలంగాణను బీఆర్ఎస్ చేతుల్లో పెట్టి నష్టపోయామని తెలిపారు. తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయనుకున్నాం కానీ.. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల తెలంగాణను గత పాలకులు మనకు చూపించారని చెప్పారు. తన తాత కాకాకు, ఈ ప్రాంతానికి చాలా అనుబంధం ఉందని, కాంగ్రెస్ పార్టీ హయాంలో కాకా, శ్రీపాదరావు కృషి ఫలితంగానే పింఛన్లు, రేషన్ కార్డులు లాంటి పథకాలు సాధించామన్నారు. దివంగత శ్రీపాదరావు సర్పంచ్ నుంచి స్పీకర్ స్థాయికి ఎదిగారని, ఆయన తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. 4 నెలల్లోనే రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన శ్రీధర్‌బాబు రాబోయే ఐదేండ్లలో ఎంత చేయగలరో ఆలోచించాలన్నారు.
బీఆర్ఎస్ లాగే బీజేపీని కూడా ఇంటికి పంపాలి
రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఇంటికి పంపినట్టుగానే కేంద్రంలో బీజేపీని కూడా ఇంటికి పంపాలని, బీజేపీతో దేశానికి నష్టం జరుగుతుందని వంశీకృష్ణ చెప్పారు. తన వంతుగా ఇండస్ట్రీ పెట్టుకొని, సింగరేణి ప్రాంతానికి చెందిన 500 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చానన్నారు.‘నన్ను మీ ఇంట్లో చిన్న కొడుకుగా భావించి గెలిపిస్తే శ్రీధర్‌బాబు ఆశీస్సులతో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా.. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీరుస్తా’ అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు శ్రీనుబాబు స్టేజీ కింద కూర్చోగా, వంశీ కృష్ణ కూడా ఆయన పక్కనే కూర్చొన్నారు. పదేండ్ల క్రితం తాను, శ్రీనుబాబు కలిసి కింద కూర్చొని దిగిన ఫొటోను వంశీకృష్ణ కార్యకర్తలకు చూపించారు. తమ మధ్య పదేండ్ల అనుబంధం ఉందని శ్రీనుబాబు కార్యకర్తలకు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి యాదవ్, చొప్పరి సదానందం, ఆరెల్లి దేవక్క, వైనాలా రాజు, రొడ్డ బాపు, తోట చంద్రయ్య, రవీందర్ రెడ్డి, కాటం సత్యం, గణపతి, పోశంతో పాటు కమాన్‌పూర్, రామగిరి మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.