‘మట్టిని కూరల్లో మసాలాగా వేసుకుంటాం. ఇంకా ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్‌లో కూడా మట్టిని జామ్‌లాగా వాడుకుంటాం’ అంటున్నారు ఇక్కడి జనం. మట్టిని తినడమా! అంటున్నారా. అయితే ఈ ప్లేస్ గురించి తెలుసుకోవాల్సిందే. చుట్టూ సముద్రం, మధ్యలో ఇంద్రధనుస్సులాగా రంగులు రంగులుగా ఉండే ఒక అందమైన దీవి. ఎటుచేసినా క్రిస్టల్స్ లాంటి ఎత్తైన తెల్లటి ఉప్పు గోడలు. ఎర్రగా పారే నీళ్లు. ఎన్నో అద్భుతాలు దాచుకున్న ఈ ప్లేస్ ఇరాన్‌లోని హొర్ముజ్ ఐలాండ్. ఇక్కడ ఇంకా చాలానే విశేషాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే మట్టిని అక్కడి వాళ్లు ‘గెలాక్’ అని పిలుస్తారు. ఈ మట్టిని వాళ్లు వంటల్లో మసాలాల్లా వాడతారు. బ్రెడ్‌తో సాస్‌లా తింటారు. దీన్ని సురాఖ్ సాస్ అంటారు. అంతేకాదు... ఆ దీవిలోని మట్టినే పెయింటింగ్స్‌లో రంగుల్లా, జుట్టుకు, పింగాణి పాత్రల మీద డిజైన్ వేయడానికి, కాస్మొటిక్స్ ఐటమ్స్‌లో కూడా వాడతారు.
ఇరాన్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉండే హొర్ముజ్ ఐలాండ్ 42 చ.కి.మీ విస్తీర్ణంలో ఒక కన్నీటి చుక్క ఆకారంలో ఉంటుంది. ఆ అందమైన రంగురంగుల ఉప్పు కొండల మధ్య తిరిగితే శరీరంలోని నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీతో నిండిన ఒక కొత్త ఉత్సాహం వస్తుందని అక్కడి జనాలు నమ్ముతారు. అందుకే దీన్ని ‘ఎనర్జీవ్యాలీ’ అని కూడా పిలుస్తున్నారు. ఇక్కడి ఎత్తైన కొండల్లో జంతువులు, పక్షుల ఆకారాలు ఎవరో చెక్కినట్టే కనిపిస్తాయి. అందుకే దీన్ని వ్యాలీ ఆఫ్ స్టాచ్యూస్ అని పిలుస్తారు కూడా.
ఈ దీవి ఇలా ఎందుకు మారిందంటే..
ఇక్కడి మట్టిలో ఉన్న 70 రకాల మినరల్స్ దానికి కారణమట. కొన్ని వేల కోట్ల ఏండ్లుగా సముద్రం నుంచి వచ్చే ఉప్పు భూమి పొరల్లో కూరుకుపోయి, ఆ ఉప్పు దీవిపైన ఉండే అగ్ని పర్వతం అడుగున ఉన్న మడ్డితో కలవడం వల్ల హెమటైటిస్ అనే ఐరన్ ఆక్సైడ్‌తో అనేక కెమికల్ రియాక్షన్స్ జరిగాయి. అప్పుడు ఆ ఉప్పు బయటికి వచ్చి అక్కడ ఎత్తైన కొండలు ఏర్పడ్డాయి. దీవిపై ఉండే మట్టి, పారే నీళ్లు అలా తయారవ్వడానికి కారణం కూడా అదే అని సైంటిస్ట్‌లు చెప్తున్నారు.