నేను బెంగాల్ టైగర్ ను: లండన్​లో మమతకు నిరసన సెగ.. దీటుగా కౌంటర్ ఇచ్చిన దీదీ

నేను బెంగాల్ టైగర్ ను: లండన్​లో మమతకు నిరసన సెగ.. దీటుగా కౌంటర్ ఇచ్చిన దీదీ

లండన్: యూకే పర్యటనలో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి నిరసన సెగ తగిలింది. శుక్రవారం లండన్​లోని ఆక్స్ ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆమె ప్రసంగిస్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ స్టూడెంట్లు కొందరు నినాదాలు చేశారు. జాదవ్​పూర్ వర్సిటీ ఘటన, బెంగాల్​లో హింస, ఆర్జీకర్ ఆస్పత్రిలో మెడికోపై రేప్ ఘటనలకు సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వారికి మమతా బెనర్జీ దీటుగా సమాధానం చెప్పారు. 

నిరసనలతో తనను భయపెట్టలేరని, తాను రాయల్ బెంగాల్ టైగర్​ నని అన్నారు. ‘మీరు చెప్పేదంతా వింటాను ప్రశాంతంగా మాట్లాడండి’ అని సూచించారు. ఆపై వాళ్లు చెప్పినవన్నీ విన్న మమత.. ఆర్టీకర్ కేసును కేంద్రమే దర్యాప్తు చేస్తోందన్నారు. ఇక్కడ రాజకీయాలు చేయొద్దని , ధైర్యం ఉంటే రాష్ట్రానికి వచ్చి రాజకీయం చేయండని వారిని సవాల్ చేశారు. స్టూడెంట్లు వెనక్కి తగ్గకపోవడంతో మమత మరోసారి స్పందించారు. ఆ తర్వాత నిర్వాహకులు నిరసనకారులను బయటకు తీసుకెళ్లగా, మమత ప్రసంగం కొనసాగించారు.