అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్లకు భయపడి అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. తాలిబన్ల నుంచి దేశాన్ని, ప్రజలను రక్షిస్తానని హామీ ఇచ్చిన ఘనీ.. పారిపోయిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నాలుగు కార్ల నిండా డబ్బులు నింపుకుని ఘనీ ఉడాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అష్రఫ్ ఘనీ స్పందించారు. తానేమీ దొంగను కాదన్నారు.
'నా స్వార్థం కోసం నేను పారిపోయానని అంటున్నారు. నా దేశ ప్రజల్ని అమ్మేసి నేను వెళ్లానని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని అఫ్గానీలను కోరుతున్నా. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అఫ్గాన్ నుంచి వెళ్లిన తీరు గురించి ఏమని చెప్పను.. కనీసం బూట్లు తీసి చెప్పులు మార్చుకోకుండా వచ్చేశా. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వచ్చేశాను. కావాలంటే ఈ విషయాన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతో కూడా ధ్రువీకరించుకోవచ్చు. నేను అక్కడే ఉంటే అఫ్గాన్ ప్రజల కళ్లముందే ఓ అధ్యక్షుడు ఉరికి వేలాడాల్సి వచ్చేది’’ అని ఘనీ పేర్కొన్నారు.