గొంతులో మటన్ ​బొక్క ​ఇరుక్కుని మృతి

కొత్తగూడ, వెలుగు : గొంతులో మటన్​బోన్​ఇరుక్కొని జనశక్తి మాజీ నక్సలైట్​చనిపోయాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ్రామానికి చెందిన కుంజ ముత్తయ్య(58) గతంలో జనశక్తి నక్సలైట్​గా పనిచేశాడు. కొన్నేండ్ల క్రితం లొంగిపోయి గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామాల్లో జరిగే ఫంక్షన్లలో కొడుకుతో కలిసి వంటలు చేస్తుంటాడు. గురువారం ముత్తయ్య భార్య సమ్మక్క ఫంక్షన్​ కోసం బంధువుల ఇంటికి వెళ్లింది.

ముత్తయ్య కొడుకు నరేశ్​గ్రామంలో జరిగిన ఓ ఫంక్షన్​లో వంట చేసి, వచ్చేటప్పుడు మటన్​ తెచ్చాడు. రాత్రి తండ్రీకొడుకులిద్దరూ కలిసి భోజనం చేస్తుండగా, ముత్తయ్య గొంతులో ఎముక ఇరుక్కుంది. ఊపిరి ఆడకపోవడంతో కొద్దిసేపు విలవిల్లాడాడు. కొడుకు నీళ్లు తాగించే ప్రయత్నం చేసేలోగానే కూర్చున్న మంచంలోనే ప్రాణాలు విడిచాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.