డీజిల్ చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్‌‌‌‌‌‌‌‌

నల్గొండ అర్బన్, వెలుగు : హైవేలపై ఆగి ఉన్న ఫోర్‌‌‌‌‌‌‌‌ వీలర్స్, లారీల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా బోలపల్లి మండలం సీతారాంపురం తండాకు చెందిన బాణావత్‌‌‌‌‌‌‌‌ బాలబద్దునాయక్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ బాలునాయక్, బాణావత్ గోవింద్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, మేరజుత్‌‌‌‌‌‌‌‌ శ్రీనునాయక్, ముడావత్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్వర్లు నాయక్, మేరజుత్‌‌‌‌‌‌‌‌ బాబ్రీనాయక్, నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లికి చెందిన వడ్త్య రాజునాయక్‌‌‌‌‌‌‌‌లు ముఠాగా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం రాత్రి వేళల్లో నల్గొండ, సూర్యాపేట జిల్లా పరిధిలోని హైవేల వెంట తిరుగుతూ పార్క్ చేసిన లారీల్లోంచి డీజిల్ ను చోరీ చేసి ఏపీకి తరలించి అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సా చేసేవారు. వీరిపై వాడపల్లి, మిర్యాలగూడ వన్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌, రూరల్‌‌‌‌‌‌‌‌, వేములపల్లి, మాడ్గులపల్లి, చిట్యాల, నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, కట్టంగూర్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదు అయ్యాయి.

బుధవారం తెల్లవారుజామున వాడపల్లి ఎస్సై రవి సిబ్బందితో కలిసి ఆర్టీఏ బార్డర్ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ టైంలో రెండు ఇన్నోవా కార్లలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం బయటపడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి దామరచర్ల మండలం కొండ్రపోల్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన నేనావత్‌‌‌‌‌‌‌‌ టాకునాయక్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ ఠాగూర్‌‌‌‌‌‌‌‌ 1500 లీటర్ల డీజిల్ కొన్నాడు. దీంతో అతడి ఇంటిపై దాడి చేసి 700 లీటర్ల డీజిల్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకోగా, ఠాగూర్‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.6 లక్షలతో పాటు, మూడు ఇన్నోవా కార్లు, ఒక జైలో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ చెప్పారు. నిందితులను పట్టుకున్న సీఐ వీరబాబు, ఎస్సై రవి, సిబ్బందిని డీఎస్పీ రాజశేఖరరాజు అభినంధించారు.