వరంగల్ జిల్లాలో డీజిల్ దొంగలు అరెస్ట్.. రాత్రి వేళల్లో పెట్రోల్ బంకులే వీరి టార్గెట్

వరంగల్ జిల్లాలో డీజిల్ దొంగలు అరెస్ట్.. రాత్రి వేళల్లో పెట్రోల్ బంకులే వీరి టార్గెట్

రాత్రుల్లో నలుగురు గుంపుగా ఏర్పడటం.. ఒక కారు తీసుకుని బయలుదేరటం.. పెట్రోల్ బంకులు టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడటం.. ఇదీ డీజిల్ దొంగల రోజూవారి దినచర్య. వరంగల్ జిల్లాలో డీజిల్ దొంగలు చేస్తున్న పనికి బంకు యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. డీజిల్ దొంగల ముఠాతో వేగలేకపోతున్నామని పోలీసులకు ఫిర్యాదులు చేసే వరకు వచ్చింది వ్యవహారం అంటే వీరి ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వివరాల్లోకి వెళ్తే.. వరుసగా డీజల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు పరకాల పోలీసులు. రాత్రి వేళలో పెట్రోల్ బంకులలో డీజిల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నారు ఈ దొంగలు. ఒకటి రెండు కాదు.. వేర్వేరు బంకుల్లో.. వేర్వేరు చోట ఈ దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని రాయపర్తి, పరకాల, జఫర్గడ్, దామెర, నడికూడ బంక్ లలో డీజిల్ పోయించుకుని ఫోన్ పే చేస్తామంటూ పారిపోతున్నారు దుండగులు.

వరుసగా దోపిడీకి పాల్పడుతున్న దొంగలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బంకు యజమానులు. నిందితులు గీసుకొండ కు చెందిన రంజిత్, ఆత్మకూరుకు చెందిన రేవూరి నవీన్ రెడ్డి, నల్గొండ జిల్లా శెట్టిపాలానికి చెందిన భరత్ చంద్ర గా పోలీసులు గుర్తించారు. దోపిడికోసం వినియోగించిన కారు,4 మొబైల్స్, రూ.12,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.