- విద్యార్థులకు సర్కారు దీపావళి కానుక
- అన్ని హాస్టల్స్, గురుకులాలకు వర్తింపు
- 7.65 లక్షలకుపైగా స్టూడెంట్లకు లబ్ధి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని హాస్టళ్లలో విద్యార్థులకు డైట్ చార్జీలను, బాలికలకు కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. చార్జీల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రిపోర్టును అందించగా, ఆయన సీఎంకు అందజేశారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్న కమిటీ సిఫార్సులను సీఎం ఆమోదించారు. ఇప్పటివరకు 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డైట్ చార్జీ రూ.950 చొప్పున ఉండగా, దానిని రూ.1,330కి ప్రభుత్వం పెంచింది. 8 నుంచి టెన్త్ వరకు రూ.1,100గా ఉన్న డైట్ చార్జీని రూ.1,540కి పెంచింది. అలాగే ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1,500గా ఉన్న డైట్ చార్జీ రూ.2,100కి పెరిగింది.
ఇక 3 నుంచి 7వ తరగతి వరకు విద్యార్థినులకు కాస్మోటిక్ చార్జీ రూ. 55 చొప్పున ఉండగా, దానిని రూ. 175కు ప్రభుత్వం పెంచింది. 8 నుంచి టెన్త్ వరకు 11 సంవత్సరాలపైన ఉన్న విద్యార్థినులకు ఇప్పటివరకు రూ.75గా ఉన్న కాస్మోటిక్ చార్జీని రూ.275కు పెంచింది. అలాగే 3 నుంచి 7 వరకు చదువుతున్న బాలురకు కాస్మోటిక్ చార్జీ రూ. 62 చొప్పున ఉండగా, రూ. 150కి పెరిగింది. 8 నుంచి టెన్త్ వరకు.. 11 ఏండ్లు పైబడిన బాలురకు కాస్మోటిక్ చార్జీ రూ. 62 ఉండగా, రూ. 200కు పెరిగింది. కాగా, రాష్ట్రంలోని అన్ని హాస్టల్స్ లో కలిపి 7,65,705 మంది స్టూడెంట్లు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.