డైట్ ​చార్జీల పెంపు.. స్టూడెంట్లు ఖుష్

డైట్ ​చార్జీల పెంపు.. స్టూడెంట్లు ఖుష్
  • అట్టహాసంగా డైట్ చార్జీల పెంపు కార్యక్రమాలు
  • నేరడిగొండలో మంత్రి సీతక్క.. పలు చోట్ల ప్రారంభించిన కలెక్టర్లు, అధికారులు

నెట్​వర్క్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో డైట్​చార్జీల కార్యక్రమాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరడిగొండ మండలంలోని లకంపూర్ ఆశ్రమ హైస్కూల్ లో చార్జీల పెంపు కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్కార్ హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు కొత్త మెనూ అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఇప్పటివరకు అమలవుతున్న డైట్ లో అనేక మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 40 శాతం ఛార్జీలు పెంచామని, 16 ఏండ్లుగా పెరగని కాస్మోటిక్ చార్జీలను 29 శాతం పెంచామన్నారు. ఈ చార్జీల పెంపుతో 8 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే  అన్నారు.

Also Read :- సంక్షేమ హాస్టళ్లల్లో పండుగలా కొత్త మెనూ ప్రారంభం

ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కాలేజీలో కామన్ డైట్ కార్యక్రమాన్ని ఎస్పీ శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే  కోవ లక్ష్మితో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జైనూర్​లోని 10 గిరిజన ఆశ్రమ స్కూళ్లలో స్టూడెంట్స్, పేరెంట్స్​కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్త మెనూ ప్రకారం మధ్యాహ్నం హాస్టల్​లో పేరెంట్స్​కు భోజనాలు ఏర్పాటు చేయగా వాటిని రుచిచూసిన వారు సంతృప్తిగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.