Good Health : ఇలా తింటే.. రోగాలు లేకుండా 100 ఏళ్లు బతుకుతారు

కీటో డైట్, వీగన్ డైట్, క్రాస్ డైట్.. ఇలా ప్రస్తుతం చాలారకాల డైట్లు పాపులర్ అవుతున్నాయి. అయితే వీటన్నింటినీ తలదన్నేలా మరో డైట్ పుట్టుకొచ్చింది. అదే ‘లాంజెవిటీ డైట్'. వాల్టర్ లాంగో అనే అమెరికన్ బయాలజిస్ట్ రూపొందించిన ఈ డైట్ ఫాలో అయితే ఏకంగా 120 ఏండ్లు జీవించే అవకాశం ఉంటుందట.

లాంజెవిటీ అంటే 'దీర్ఘాయువు' అని అర్థం. అంటే ఈ డైట్ .. ఎక్కువకాలం జీవించడం కోసం డిజైన్ చేసినది అని పేరుని బట్టి తెలుస్తుంది. అయితే ఈ డైట్ ప్రత్యేకంగా వయసుపై బడిన వాళ్ల కోసం రూపొందించినట్టు వాల్టర్ లాంగో చెప్తున్నాడు. ఈ డైట్ రూల్స్ ఏంటంటే.. 

డైట్ రూల్స్....

ఎక్కువ ఆకుకూరలు, తక్కువ ప్రొటీన్స్, ఉపవాసం.. లాంజెవిటీ డైట్ లో ముఖ్యమైన మూడు రూల్స్ ఇవే.. 

*ఈ డైట్ లో ఆకుకూరలు, ఫ్రూట్స్, బీన్స్, నట్స్, ఆలివ్ నూనె, సీ ఫుడ్ లాంటివి తినాలి. 

*మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తినకూడదు. 

*అలాగే ఫ్యాట్స్, షుగర్స్ తీసుకోకూడదు. 

*పాల ఉత్పత్తులను మానేయలేకపోతే ఆవు లేదా మేక పాలు తీసుకోవచ్చు. 

*ఈ డైట్ లో బరువుని బట్టి ప్రొటీన్లు తీసుకోవాలి. 

*ఒక రోజులో ఒక కిలో బరువుకు 0.68 నుంచి 0.80 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోకూడదు. 

*ఉదాహరణకు ఒక వ్యక్తి 60కిలోల బరువుంటే.. రోజుకు 40.8 నుంచి 48 గ్రాములకు మించి ప్రొటీన్లు తీసుకోకూడదు.

టైమింగ్ ఇలా..

ఈ డైట్ లో మరో రూల్ ఏంటంటే..  

*ఏదైనా సరే విడతల వారీగా తినాలి. 

*రోజులో తీసుకునే మొత్తం ఫుడ్ కేవలం 12 గంటల్లోనే తినాలి.

ఉదాహరణ..

ఉదయం 7 గంటలకు మొదటి మీల్ తీసుకుంటే సాయంత్రం 7 గంటల లోపు రెండు లేదా మూడవ మీల్ తినేయాలి. అలా 12 గంటల్లోపు తినేలా ప్లాన్ చేసుకోవాలి. మిగతా టైం అంతా ఉపవాసం ఉండాలి. భోజనానికి నిద్రకు మధ్య కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలి. అలాగే వారంలో రెండు రోజులు మాత్రం రెండు వేల కంటే తక్కువ క్యాలరీలుండే ఆహారాన్ని తీసుకోవాలి. 

ఈ డైట్ లో ఉడికించిన, గ్రిల్ చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. బేకింగ్ ఫుడ్స్, వేగించిన ఫుడ్ తినకూడదు. విటమిన్, మినరల్ సప్లిమెంట్లు లేదా ఇతర మందులు వాడుతున్నవాళ్లు వాటిని కంటిన్యూ చేయొచ్చు. 

లాంగ్ లైఫ్ కోసం..

ఈ డైట్ లో ఆకుకూరల నుంచి విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. నట్స్, ఆలివ్ నూనె నుంచి హెల్దీ ఫ్యాట్స్ అందుతాయి. షుగర్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. 

ఈ డైట్ ని పాటించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్, ఒబెసిటీ, గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఇవన్నీ ఎక్కువ కాలం జీవించేందుకు సాయం చేస్తాయని లాంగో చెప్తున్నాడు. వాల్టర్ లాంగో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో లాంజెవిటీ ఇనిస్టిట్యూట్ కు డైరెక్టర్ పనిచేస్తున్నాడు. లాంగో గతంలో న్యూట్రిషన్ విభాగంలో నోబెల్ ప్రైజు నామినేట్ అయ్యాడు.