రాజ్యాంగ నిర్మాతలు భారతదేశ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాల కలయికగా రూపొందించారు. దేశంలోని భిన్నత్వం, దేశ విభజన కాలం నాటి పరిస్థితులు మన రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి దోహదపడిన అంశాలుగా రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు విశ్లేషిస్తారు. భారత రాజ్యాంగ విశ్లేషకుల్లో ప్రముఖుడిగా పేర్కొనే గ్రాన్విలే ఆస్టిన్ భారత సమాఖ్య నిర్మాణం ప్రత్యేకమైంది, వాస్తవికమైందిగా పేర్కొంటూ మన రాజ్యాంగ నిర్మాతల దూర దృష్టిని కొనియాడారు.
అధికారాల పంపిణీ
- రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన మూడు జాబితాలు ఉన్నాయి.
- కేంద్ర జాబితాలో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న 97 అంశాలు చేర్చగా ఇటీవల వరకు100 అంశాలు ఉండేవి. 101వ రాజ్యాంగ సవరణ వల్ల 98కి తగ్గాయి.
- ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చగా ప్రస్తుతం 59 అంశాలు మాత్రమే ఉన్నాయి.
- పై మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అధికారాలుగా పేర్కొంటూ వాటిపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించారు. ఒక అంశం అవశిష్ట అంశమా? కాదా? అనేది సుప్రీంకోర్టు నిర్ధారిస్తుంది. సమాఖ్య ప్రభుత్వ ముఖ్య లక్షణమైన అధికారాల పంపిణీని భారత రాజ్యాంగంలో పొందుపర్చారు.
లిఖిత రాజ్యాంగం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం ద్వారా అధికార బదిలీ జరిగినందున మన రాజ్యాంగం లిఖితపూర్వకమైంది. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని 73వ అధికారణలోనూ రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిని 162వ అధికరణలోనూ పేర్కొన్నారు.
దృఢ రాజ్యాంగం
మారుతున్న దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పరిపాలనలో మార్పులు చేపట్టాలంటే రాజ్యాంగాన్ని కూడా సవరించాలి. మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించేటప్పుడు అమెరికా మాదిరిగా పార్లమెంట్ ప్రత్యేక తీర్మానంతోపాటు రాష్ట్రాల ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉండటంతో ఈ విషయంలో మన రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉన్నది.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ
కేంద్రానికీ, రాష్ట్రాలకూ, రాష్ట్రాలకూ రాష్ట్రాలకూ మధ్య వివాదాలు తలెత్తినప్పుడు 131వ అధికరణను అనుసరించి ఈ వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. భారత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో గానీ లేక రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో గానీ కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిలో తీర్పులను ఇస్తుంది.
రాజ్యాంగ ఆధిక్యత
భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరిస్తాయి. కేంద్రానికీ రాష్ట్రాలకూ, రాష్ట్రాలకూ రాష్ట్రాలకూ మధ్య సమస్యలను సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అనుసరించే పరిష్కరిస్తుంది. మన దేశంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ మొత్తంగా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాలి. ఈ కారణంగా మన దేశంలో రాజ్యాంగ ఆధిక్యత ఉన్నది.
రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు
జాతీయ , అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలపై విధానాలను రూపొందించి పరిపాలనను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వ, ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలపై విధానాన్ని రూపొందించి పరిపాలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఏకకాలంలో రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు ఏర్పడి పనిచేస్తాయి.
రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర
భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించేటప్పుడు పార్లమెంట్ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతోపాటు దేశంలోని 1/2వ వంతు రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి.
పార్లమెంట్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం
రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పార్లమెంట్ రూపొందించే శాసనాల విషయంలోనూ రాజ్యాంగ సవరణల విషయంలోనూ రాజ్యసభ రాష్ట్రాల హక్కులను సంరక్షించే కృషి చేస్తుంది.
కారణాలు
పరిపాలన సౌలభ్యం: విశాలమైన భూభాగాన్ని, విస్తృతమైన జనాభాను కలిగి ఉన్న భారతదేశ పరిపాలన మొత్తం ఒకే ఒక కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం సాధ్యం కానందున పరిపాలన సౌలభ్యం కోసం కేంద్రం కొన్ని బాధ్యతలను, రాష్ట్రాలు మరికొన్ని బాధ్యతలను నిర్వహించడానికి అనుగుణంగా మన దేశ సమాఖ్య విధానాన్ని ఏర్పాటు చేశారు.
భిన్నత్వం: భిన్నమైన సంస్కృతులు, భాషలు, మతాలు, భౌగోళిక పరిస్థితులు మొదలైన వాటి కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలు అంటే రాష్ట్రాల్లో పరిపాలన అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఆయా రాష్ట్రాలు తమ తమ పరిపాలన విధానాలు రూపొందించుకోవడానికి అవసరమైన అధికారాలను పంపిణీ చేయాల్సి వచ్చింది.
భారత ప్రభుత్వ చట్టం 1935: 1935 చట్టం ప్రకారం దేశ పరిపాలన కోసం సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1935 చట్టాన్ని ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగం నిర్మించారు. అందువల్ల మనదేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నది.