వీరుల గాథ… ‘కోయ’ల కథ

ఒక జాతి, సమూహం, తెగ, బృందం సామూహికంగా జరుపుకునే ఉత్సవం. తమ గోత్రీకులను, వీరులను తలుచుకోవడంకోసం సమ్మక్క సారలమ్మల వంటివారి పేర కోయలు జాతరలను ఏర్పాటు చేసుకుంటారు. కోయల ప్రతి జాతరకు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి. వాటిని పాటిస్తూ తమ తెగ నమ్మకాలు, విశ్వాసాలతో చేసుకునే ఉత్సవం. కోయలుచేసుకునే పండుగలు, జాతరలలో తప్పనిసరిగా 25 రకాల ఎవరి పనులను వారు చేయాలి. తలపతులు నిష్టతో ఉండి పగిడెలను తీసుకురావాలి. ఆ కోయల అధికార కథాగాన ప్రదర్శనను ప్రదర్శించాలి. వీరిలోని కొందరు పగిడెలను తయారు చేయాలి.

గట్టు, గోత్రం, ప్రాంతం వంటి విభాగానికి చెందిన ముఖ్య పురుషుల పేర జాతరలు సాగుతాయి. కాని, అందులో కోయజాతి పుట్టుక నుండి వారి మరణం వరకు కథ నడుస్తుంది.

కొన్ని ప్రాంతాలలో ఆయా పండుగల సందర్భాలలో గిరిజన ఉత్సవాలు జరుగుతాయి. ఛత్తీస్​గఢ్​లోని దంతేవాడలో దసరా సందర్భంగా దంతేశ్వరీదేవి జాతర జరుగుతుంది. దంతేశ్వరి దేవి ప్రతిరూపాన్ని జగదల్​పూర్​కు తీసుకువస్తారు. అన్ని ఊళ్లల్లో, గూడాలలో ఆదివాసులు పండుగ జరుపుకుంటారు. చాలావరకు ఆదివాసులకు స్త్రీ దేవతలు ఉంటారు. బెంగాల్​లో దుర్గ, తెలంగాణలో బతుకమ్మ, ఛత్తీస్​గఢ్​లో దంతేశ్వరి వంటి స్త్రీ దేవతల పేర జాతరలు, పండుగలు జరుగుతాయి.

వీటిలో సమ్మక్క, సారలమ్మ జాతర ఒక నిర్దిష్టమైన చోట, నిర్దిష్టమైన దినాలలో జరుపుకుంటారు. ఇతర హిందువుల పండుగలకు, ఈ నియమం ఉండదు. సంక్రాంతి, హోళీ, ఉగాది, దీపావళి వంటి పండుగలు ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకుంటారు. కాని, ఆదివాసులు అందరూ ఒకేచోట చేరి సామూహికంగా పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. గోండులు కేస్లాపూర్​లో నాగోబా జాతర జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఖండోబా జాతరలు ఇలాంటివే. జానపదులు తెలంగాణలో, ఆంధ్రలో మల్లన్న జాతరలు, శివరాత్రి రోజున అనేక జాతరలు ఒక పుణ్యక్షేత్రంలో, ఆలయంలో నిర్వహించుకుంటారు.

సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిసారీ ఎంతో గొప్పగా జరుగుతుంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందినా పొందకపోయినా అది దినదిన ప్రవర్దమానం అవుతోంది.  పది రాష్ట్రాల నుండి ఆదివాసులు, ఇతరులు ఇక్కడకు రావడంవల్ల జాతీయ పండుగలా మారిపోయింది. ఈ జాతరను భారత ప్రభుత్వం దక్షిణాది ఆదివాసీ కుంభమేళాగా
గుర్తించవలసి ఉంది.

మోడర్న్​​ మేడారం!

మేడారం అంటేనే ప్రకృతి ఒడిలో సేద తీరే అడవి బిడ్డల ఒడి. నిత్యం గలగలపారే సెలయేర్లు, పక్షుల కిలకిలలు,  ప్రకృతి  సోయగాలు మేడారం మార్గంలో కనిపిస్తాయి.  మేడారం జాతరకు పట్నం వాసులు ఉవ్విళ్లూరుతుంటారు. ఒకప్పుడు ఎడ్ల బండ్ల సవ్వడులు బాగా వచ్చేవి. ఇప్పుడు కనెక్టివిటీ పెరగడంతో సవారు బండ్ల ప్లేస్​ని కార్లు, ఆటోలు ఆక్రమించాయి. భక్తుల సంఖ్య ప్రతీ రెండేళ్లకూ పెరగడంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లుకూడా జరుగుతున్నాయి.

మేడారం రావాలంటే ఒకప్పుడు భయపడేవారు. ఏటూరునాగారం-తాడ్వాయి అభయారణ్యంలో దట్టమైన అడవిలో ఉన్న కుగ్రామం వచ్చేందుకు తల్లులను శరణు వేడుతూ వచ్చేవారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి జాతర ప్రతీ రెండేళ్ల కోసారి జరుగుతుండగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ తల్లులు పేరుగాంచారు. దీంతో భక్తుల సంఖ్య పెరిగిపోయింది. దట్టమైన అరణ్యంలో అలనాడు ఎడ్లబండ్లతో వచ్చేవారు. ఎటుచూసినా కనిపించనంత అరణ్యం.. పక్షులు, వన్యప్రాణుల అరుపులు వినిపించేవి.

జాతరకు వచ్చే వారు కో అంటే కో అనుకునేవారు. ఎడ్లబండ్లకు అడ్డుగా పెద్దపులులు వచ్చేవని వెనకటివారి ముచ్చట. తల్లులను మనసులో వేడుకొని మొక్కుకోగానే పెద్ద పులులు అడవిలోకి వెళ్లిపోయేటివని చెబుతుంటరు.