Spiritual: ఆధ్యాత్మిక జీవితానికి.. భౌతిక జీవితానికి తేడా తెలుసా..

భౌతిక జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కింద పడక తప్పదు. ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని  పురాణాలు.. ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  అసలు భౌతిక జీవితానికి.. ఆధ్యాత్మిక జీవితానికి తేడా ఏంటి? రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

వాస్తవానికి  భౌతికం, ఆధ్యాత్మికం రెండు వేరు వేరుగా ఉండవు. ఉన్నది ఒక్కటే జీవితం. మిషిన్ ఎట్లా పని చేస్తది? అది నడవాలంటే ఏం కావాలె? ఏముంటే ఎఫిషియెంట్గా నడుస్తది? అనే విషయాలు చెప్పేదే సాంకేతిక శాస్త్రం (ఇంజినీరింగ్). అలాగే.. మనం ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా కూడా ఈ జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా, బాధ్యతా యుతంగా, స్వేచ్ఛగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ.. ఎంతో మందికిసాయం చేస్తూ.. ఎట్లా నడపాలె? ఎట్లా జీవించాలి..  ఈ రోజు కంటే రేపు ఎట్లా ఆనందంగా జీవించాలి  అని చెప్పే శాస్త్రమే ఆధ్యాత్మికం. అదే జీవిత శాస్త్రం. 

ఇది అర్థమైతే.. ఆధ్యాత్మికం వేరు.. భౌతికం వేరు అనే తేడాలు కనిపించవు. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మనమే తెలిసీ తెలియక  భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మికాన్ని సెపరేట్ చేస్తున్నాము. ఆధ్యాత్మికం అంటే ధ్యానం, మతానికి సంబంధించిన జ్ఞానం అని... భౌతిక జీవితం అంటే ఉద్యోగం, వ్యాపారం,ఇల్లు, వాకిలి సంసారం అనుకుంటున్నాం. ఈ రెండింటిలో దేన్ని ఎంత పరిమాణంలో చూడాలె? దేనికి ఎంత వరకు మనం బాధ్యత వహించాలి? దేనికి ఎంత టైం కేటాయించాలె? దేంట్లో మనం ఎంత శక్తివంతంగా ఉండాలి? ఎక్కడ ఎంత శక్తిని, ఎక్కడ ఎంత జ్ఞానాన్ని ఉపయోగించాలె? అని చెప్పేదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటే.. ఎక్కడికెళ్లినా పవర్ఫుల్ గా జీవించవచ్చు. 

ASLO READ | ఫిలాసఫీ : జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవటం కాదు.. ప్రతిక్షణం విలువైనదే..!

అప్పుడు ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు ఎలా అవుతుంది.   తెలిసో.. తెలియకో.. మనం అన్నింట్లో అవసరానికి మించి  సమయం గడుపుతుంటం. .. అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెడుతుంటాం.. అసలు డబ్బు ఎంత కావాలి అంటే బతికేంత కావాలి. 

 24 గంటలు డబ్బులు డబ్బులు అనుకుంటూ తిరిగితే అది భౌతిక జీవితమైపోతుంది'. ‘ఒక మనిషి లేకుంటే నేను చచ్చిపోతా !' అనేది భౌతిక జ్ఞానం. జీవితం కొన్ని విషయాలతోనే ముడిపడిలేదు. మనం ఎన్నో సాధించడానికి పుట్టినామని గుర్తించాలి. అన్నీ సాధ్యం అని చెప్పేదే ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి ఆధ్యాత్మికాన్ని, భౌతికాన్ని వేరువేరుగా బ్యాలెన్స్ చేయడం అనేదేం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎక్కడికెళ్లినా దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. తర్వాత దాన్ని అందరికీ పంచాలి.