
పార్లమెంట్లో ఒకే సభ ఉంటే ఏకసభా విధానమని, రెండు సభలుంటే దానిని ద్విసభా విధానం అంటారు. భారత్ పార్లమెంట్ లో లోక్‌సభ, రాజ్యసభ, కొన్ని రాష్ట్రాల్లోని శాసనసభల్లో విధానసభ, విధాన పరిషత్ లు ఉన్నాయి. అమెరికాలోని కాంగ్రెస్‌లో ఎగువసభ సెనేట్, దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఇంగ్లండ్‌లోని పార్లమెంట్లో ఎగువసభ హౌస్ ఆఫ్ లార్డ్స్, దిగువసభ హౌస్ ఆఫ్ కామన్స్ ఉన్నాయి. పార్లమెంట్లో రెండు సభలు ఉన్నప్పుడు ఉభయసభలను తులనాత్మకంగా పోలిస్తే సభ్యుల సంఖ్య, ప్రాతినిధ్యం, కాలపరిమితి లక్షణాలను గమనించవచ్చు.
సభ్యుల సంఖ్య : సాధారణంగా దిగువ సభలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. కానీ, బ్రిటన్ దిగువసభ కంటే ఎగువసభలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు.
ఉదాహరణ : ఇండియాలో లోక్‌సభలో 545, రాజ్యసభలో 245, అమెరికా సెనేట్‌లో 100, హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్‌లో 435, బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో 650, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో 788 మంది సభ్యులు ఉన్నారు.
ప్రాతినిధ్యం : ఏ దేశంలోనైనా దిగువసభలో ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎగువసభలో దేశాన్నిబట్టి ప్రాతినిధ్యం మారుతూ ఉంటుంది.
ఉదాహరణ : ఇండియాలో రాజ్యసభ: రాష్ట్రాల ప్రతినిధి, అమెరికాలో సెనేట్: రాష్ట్రాల ప్రతినిధి, ఇంగ్లండ్‌లో హౌస్ ఆఫ్ లార్డ్స్ కులీనుల/ ప్రభువుల ప్రతినిధి, భారతదేశంలోని రాష్ట్రల్లోని విధాన పరిషత్: టీచర్లకు, గ్రాడ్యుయేట్లకు, స్థానిక సంస్థల ప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు ప్రతినిధి.
కాల పరిమితి : ఏ దేశంలోనైనా దిగువసభ తాత్కాలికమైంది. ఎగువసభ శాశ్వత కాల పరిమితిని కలిగి ఉంటుంది. కానీ సభ్యులు నిర్ణీత కాలపరిమితిని కలిగి ఉంటారు.
పార్లమెంట్లో ఉభయసభల హోదా
పార్లమెంట్లో లోక్‌సభ, రాజ్యసభలను పరస్పరం పోల్చినప్పుడు మూడు రకాల పరిస్థితులను గమనించవచ్చు. అవి.. ఉభయ సభల సమాన హోదా, రాజ్యసభ అథమ హోదా, రాజ్యసభ ప్రత్యేక హోదా.
ఉభయసభల సమాన హోదా : ఎగువసభ అయిన రాజ్యసభ లోక్‌సభతో సమాన హోదాను కింది విషయాల్లో కలిగి ఉంటుంది.
- సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు.
- సాధారణ బిల్లులను ఉభయసభలు తిరస్కరించవచ్చు.
- రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశ పెట్టడం, ఆమోదించే ప్రక్రియ రెండింటికీ సమానం.
- రాష్ట్రపతిని ఎన్నుకోవడం, తొలగించడంలో ఉభసభలు కూడా పాల్గొంటాయి.
- ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం, తొలగించడంలో ఉభయ సభలకు సమాన అధికారం ఉంటుంది.
- సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను, ప్రధాన ఎన్నికల కమిషనర్, కాగ్‌లను తొలగించమని రాష్ట్రపతికి సూచించడంలో రెండు సభలకు సమాన అధికారాలు ఉంటాయి.
- రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్‌లను రెండు సభలు ఆమోదిస్తాయి.
- రాష్ట్రపతి విధించే మూడు రకాల అత్యవసర పరిస్థితులను రెండు సభలు ఆమోదించడం.
- మంత్రులు ఏ సభలో నుంచైనా ఎంపిక చేయవచ్చు.
- ఆర్థిక సంఘం, కాగ్, యూపీఎస్సీ సమర్పించే నివేదికలను చర్చించడం, ఆమోదించడం.
- బడ్జెట్‌ను చర్చించే అధికారం రెండింటికీ ఉంది.
- సుప్రీంకోర్టు, యూపీఎస్సీ అధికార పరిధిని విస్తరింపజేయడం.
రాజ్యసభ అథమ హోదా : లోక్‌సభతో పోల్చినప్పుడు రాజ్యసభ కింది విషయాల్లో తక్కువ అధికారాలు కలిగి ఉంటుంది.
- ఆర్థిక బిల్లులను ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు.
- రాజ్యసభ ఆర్థిక బిల్లు విషయంలో కేవలం మార్పులను మాత్రమే సూచించాలి. తిరస్కరించకూడదు. ఈ మార్పులతో ఏకీభవించడం లేక తిరస్కరించడం లోక్‌సభ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
- ఒక బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించే అధికారం లోక్‌సభ స్పీకర్‌కే ఉంటుంది.
- ఉభయ సభల సభ్యులను పోల్చినప్పుడు రాజ్యసభ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
- ఉమ్మడి సమావేశంలో సాధారణంగా లోక్‌సభ అభిప్రాయమే చెల్లుబాటు అవుతుంది.
- ఉమ్మడి సమావేశానికి లోక్‌సభ స్పీకర్ లేక డిప్యూటీ స్పీకర్లు మాత్రమే అధ్యక్షత వహిస్తారు.
- బడ్జెట్‌పై ఓటింగ్ చేసే అధికారం రాజ్యసభకు లేదు.
- జాతీయ అత్యవసర పరిస్థితిని ఉపసంహరించే తీర్మానం చేసే అధికారం లోక్‌సభకు మాత్రమే ఉంది. రాజ్యసభకు లేదు.
- మంత్రిమండలి ఉమ్మడిగా లోక్‌సభకే బాధ్యత వహిస్తుంది.
- అవిశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం, ధన్యవాద తీర్మానం, అభిశంసన తీర్మానం, కోత తీర్మానాలు వంటివి లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టి ఆమోదం పొందుతాయి.
- అంచనాల సంఘంలో లోక్‌సభ సభ్యులు మాత్రమే ఉంటారు.
ప్రత్యేక హోదా : భారతదేశంలో ఉన్న సమాఖ్య వ్యవస్థను రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి రాజ్యసభకు ప్రత్యేక అధికారం కల్పించారు. కింది అంశాల్లో రాజ్యసభకు లోక్‌సభకు లేని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
ఆర్టికల్ 67 ప్రకారం : ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభ తీర్మానం ఆమోదించిన తర్వాతనే అది లోక్‌సభకు పంపాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 249 ప్రకారం : రాష్ట్ర జాబితాపై జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ చట్టం చేయాలని భావిస్తే ముందుగా రాజ్యసభ తీర్మానం చేయాలి.
ఆర్టికల్ 312 ప్రకారం : నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే ముందుగా రాజ్యసభలో సభకు హాజరై ఓటువేసిన వారిలో 2/3 వంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి.
ఆర్టికల్స్ 352, 356, 360 ఆధారంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్‌సభ రద్దయి ఉంటే రాష్ట్రపతి చేసిన ఆ ప్రకటనను ముందుగా రాజ్యసభ ఆమోదించాల్సి ఉంటుంది.