24 గంటల్లో 357 మంది మృతి

24 గంటల్లో 357 మంది మృతి
  • యూకేకి చేరువలో కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కేసులతో పాటు చనిపోయిన వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 357 మంది వైరస్‌కి బలయ్యారని అధికారులు చెప్పారు. ఇంత మంది ఒకేరోజు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. దీంతో గురువారం నాటికి కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 8,102కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 9996 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. దీంతో మన దేశంలో కేసుల సంఖ్య 2,86,579కి చేరింది. గత వారం రోజులుగా దాదాపు రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో టాప్‌ 5లో ఉన్న మనం టాప్‌ 4లో ఉన్న యూకేను బీట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ ప్రకారం ప్రస్తుతం యూకేలో 2.9లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇండియాలో ఇదే ఉధృతి కొనసాగితే కచ్చితంగా యూకేను దాటేస్తామని హెచ్చరించారు. కాగా.. యూకేతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు చాలా తక్కువగా ఉందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్‌ 11వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు 12వ స్థానంలో ఉన్న మన దేశం కెనడాను దాటేసింది.