- చక్రం తిప్పుతున్న పలువురు కౌన్సిలర్లు
భద్రాద్రికొత్తగూడెం,వెలుగు:జిల్లాలోని కొత్తగూడెం,ఇల్లెందు మున్సిపాలిటీలలో అవిశ్వాసం టెన్షన్ నెలకొంది. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ పాలకవర్గాలున్నాయి. ఈ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు రోజు రోజుకూ రచ్చకెక్కుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయా మున్సిపాలిటీల చైర్మన్లను గద్దె దించేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లే పావులు కదుపుతున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్ పర్సన్ కాపుసీతాలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీలోని పలువురు కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జనవరిలో అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అవిశ్వాసానికి స్కెచ్..
జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలున్నాయి. పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగలేదు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకొని పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక అయినప్పటి నుంచీ టీఆర్ఎస్ లో కౌన్సిలర్లలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి జనవరితో పాలకవర్గాలకు మూడేండ్లు ముగియనుండడంతో ఆవిశ్వాసానికి అధికార పార్టీలోని పలువురు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు.
చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆమెకు వ్యతిరేకంగా కౌన్సిల్ మీటింగ్లలో అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం బూడిదగడ్డ ఏరియాలో 11 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు రహస్య మీటింగ్ నిర్వహించారు. జనవరిలో అవిశ్వాసం పెట్టే విషయంపై చర్చించారు.
అవిశ్వానికి సీపీఐ కౌన్సిలర్ల మద్దతు కోరేందుకు ఆ పార్టీ జిల్లా సెక్రటరినీ కలిశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు. పార్టీలోని పెద్దల నుంచి తమకు ఆశీస్సులున్నాయని ఆవిశ్వాసంలో విజయం సాధిస్తామంటూ చైర్ పర్సన్ వ్యతిరేక వర్గీయులు పేర్కొనడం గమనార్హం. ఏ విషయంలోనూ తమతో చైర్ పర్సన్ కలిసిరారని, ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం, కేవలం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కొడుకు వనమా రాఘవ మాటలకే చైర్ పర్సన్ ప్రధాన్యం ఇస్తూ మిగిలిన కౌన్సిలర్లను చులకనగా చూస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ఇల్లెందు మున్సిపాలిటీలో చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్రావుకు వ్యతిరేకంగా వైస్ చైర్మన్ జానీ పాషా పావులు కదుపుతున్నారు. ఆవిశ్వాసం పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీలోని కౌన్సిలర్లతో గత కొంత కాలంగా మంతనాలు సాగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలోని మున్సిపాలిటీ కౌన్సిలర్లలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, భానోత్ హరిప్రియతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో వర్గ విభేదాలను ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.