వికారాబాద్, వెలుగు: వికారాబాద్లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మద్దతుదారులు, అసమ్మతి వర్గానికి మధ్య ఘర్షణ చెలరేగింది. మెతుకు ఆనంద్కు వ్యతిరేకంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని నాగేశ్ గుప్తా ఫాంహౌస్లో ఓ వర్గం ఆత్మీయ సమ్మేళనం కింద రహస్యంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. సమావేశం కోసం ఏర్పాటు చేసుకున్న టెంట్లు, కుర్చీలను ఎమ్మెల్యే అనుచరులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీను రెండు వర్గాలను చెదరగొట్టారు. అధికారం చేతిలో ఉందనే గర్వంతో ఎమ్మెల్యే అనుచరులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అసమ్మతి వర్గం నాయకులు మండిపడ్డారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.