కాంగ్రెస్​లో గ్రూపుల లొల్లి .. ఆరోపణలు, విమర్శలతో హైకమాండ్​కు ఫిర్యాదు

కాంగ్రెస్​లో గ్రూపుల లొల్లి .. ఆరోపణలు, విమర్శలతో హైకమాండ్​కు ఫిర్యాదు
  • మండల, పట్టణ అధ్యక్షుల  నియామకంపై సీనియర్ల ఫైర్​  
  • మెదక్​, నర్సాపూర్​ సెగ్మెంట్​లలో  గ్రూప్​ విభేదాలు   

మెదక్​, వెలుగు: జిల్లా  కాంగ్రెస్ పార్టీ లో కయ్యం మొదలైంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో   నేతల మధ్య  విభేదాలు భగ్గుమంటున్నాయి.  సొంత పార్టీ నేతలపైనే పరస్పర విమర్శలు, ఆరోపణలతో హైకమాండ్​కు ఫిర్యాదులు చేయడం  చర్చనీయాంశంగా మారింది. తిరుపతిరెడ్డి  వర్సెస్​  సుప్రభాత్ రావ్​జిల్లాలో కాంగ్రెస్​ మండల, పట్టణ కమిటీలకు ఇటీవల కొత్త అధ్యక్షులను నియమించారు. అప్పటి నుంచే విభేదాలు షురూ అయ్యాయి. మెదక్ నియోజకవర్గంలోని మండల, పట్టణ కమిటీ అధ్యక్షుల నియామకంలో  ముఖ్య నాయకులు అభిప్రాయం తీసుకోకుండా డీసీసీ ప్రసిడెంట్​ తిరుపతిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని రామాయంపేటకు చెందిన టీసీసీసీ మెంబర్​ చౌదరి సుప్రభాత్​ రావ్, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షులు హఫీజొద్దీన్​ ఆరోపిస్తున్నారు. ఇందుకు  నిరసనగా..  మెదక్​ టౌన్, ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు వెళ్లి గాంధీభవన్​ వద్ద ధర్నా చేశారు.

ఏకపక్షంగా నియమించిన కమిటీలను రద్దు చేయాలని   డిమాండ్​ చేశారు.  డీసీసీ ప్రసిడెంట్​ తిరుపతిరెడ్డి టీఆర్​ఎస్​ పార్టీకి కోవర్ట్​గా పనిచేస్తున్నారని ఆరోపించారు.  కాగా ఈ ఆరోపణలను తిరుపతిరెడ్డి   ఖండించారు.  తనను కోవర్టు అన్నవాళ్లు దమ్ముంటే పచ్చిబట్టలతో గుడిమీదకు రావాలని సవాల్​ విసిరారు.  పార్టీకోసం కష్టపడి పని చేస్తున్నవారినే అధ్యక్షులుగా నియమించామన్నారు. ఇదిలా ఉండగా సుప్రభాత్ రావ్​ డీసీసీ ప్రసిడెంట్​ తిరుపతిరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ  మండలాల, మెదక్​ పట్టణ కాంగ్రెస్​   అధ్యక్షులు రామాయంపేటలో ధర్నా నిర్వహించారు.  గత కొద్ది రోజులుగా తిరుపతిరెడ్డి, సుప్రభాత్​ రావ్​ ఫాలోవర్స్​ మధ్య వాట్సప్​ గ్రూపుల్లో విమర్శల వార్​ నడుస్తోంది. 

రాజిరెడ్డి వర్సెస్​ అనిల్​ కుమార్ 

నర్సాపూర్​ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్​ మండల కమిటీల నియామకం విభేదాలకు ఆజ్యం పోసింది. ఈ సెగ్మెంట్ లో  పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ వైస్​ ప్రసిడెంట్​, మెదక్​ పార్లమెంట్​ ఇన్​ చార్జి అనిల్​ కుమార్​ వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల వెల్దుర్తి మండల కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షునిగా ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన మహేశ్​రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. కాగా ఈ విషయంలో   ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్ వర్గీయుల మధ్య హైద్రాబాద్​లో వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రాజిరెడ్డి వర్గీయులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు, దాడికి యత్నించినట్టు గాలి అనిల్​ కుమార్  టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం సూచనల మేరకు డీసీసీ ప్రసిడెంట్​ తిరుపతిరెడ్డి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, టీపీసీసీ మత్స్య విభాగం రాష్ట్ర కార్యదర్శి, కుకునూరు మాజీ సర్పంచ్ మల్లేశం, కలాన్​శెట్టిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డిని కాంగ్రెస్​ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఇరు వర్గాల మధ్య విబేదాలు మరింత పెంచినట్టయింది. రాజిరెడ్డి, అనిల్​ కుమార్​ మధ్య నెలకొన్న విభేదాలు ఇటీ డీసీసీ, అటు పీసీసీకి తలనొప్పిగా మారాయి. 

జహీరాబాద్​ సెగ్మెంట్​ లో కాంగ్రెస్​ అభ్యర్తి ఎవరో?

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు :  జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్​  అభ్యర్థి ఎవరన్నది తేలడం లేదు. మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి ఈసారి   సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు  ప్రచారం జరుగుతోంది. అయితే జహీరాబాద్​ నుంచి ఎవరు పోటీ చేయాలనుకున్నా  గీతారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే.   మరో నేత  నియోజకవర్గ ఇన్​చార్జి నరోత్తం ఇటీవల సీఎం సమక్షంలో బీఆర్ఎస్ లో  చేరిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన  బీజేపీ  నేత  ఎ.చంద్రశేఖర్  కాంగ్రెస్ లో చేరితే జహీరాబాద్ టికెట్ ఇస్తామని  హామీ ఇచ్చినట్టు తెలిసింది.  అయితే  జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని  భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ   చేస్తే ఎలా ఉంటుందని  చంద్రశేఖర్ కొద్దిరోజుల కింద  సర్వే చేయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పరిస్థితిపై అంచనా వేయడంతో పాటు , బీఆర్​ఎస్​  అసంతృప్తుల గురించి కూడా ఆరా తీసినట్టు   వినిపిస్తోంది.  తన సొంత నియోజకవర్గం వికారాబాద్ కు ఆనుకుని జహీరాబాద్ సెగ్మెంట్ ఉండడం ఈ ప్రాంతంలోని వారితో చంద్రశేఖర్ కు పరిచయాలు ఉండడం కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.