మేయర్​ వర్సెస్​ కమిషనర్ .. ఖమ్మం కార్పొరేషన్​లో ఆధిపత్య పోరు

మేయర్​ వర్సెస్​ కమిషనర్ .. ఖమ్మం కార్పొరేషన్​లో ఆధిపత్య పోరు
  • పెత్తనం కోసం ఇద్దరి ఆరాటంతో తిప్పలు
  • ఇటీవల పలు నిర్ణయాల్లో అభిప్రాయభేదాలు 
  • ఆఫీస్ మెయింటెనెన్స్ నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఇబ్బందులు
  • మంత్రులు దృష్టి సారిస్తేనే పరిపాలన మెరుగు 

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్దల మధ్య కొద్ది రోజులుగా అంతర్యుద్ధం నడుస్తోంది. మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్​ అగస్త్య​ మధ్య అభిప్రాయభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఇటీవల పలు నిర్ణయాల్లో ఏకాభిప్రాయం లేకపోవడంతో కార్పొరేషన్​ అధికారులతో పాటు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పాలనపై, అధికారులపై పట్టుసాధించేందుకు మేయర్​ ప్రయత్నిస్తుండగా, అడ్మినిస్ట్రేషన్​ విషయంలో ఐఏఎస్​ అధికారి అయిన కమిషనర్​ పట్టుదలగా ఉండడంతో ఇద్దరి మధ్య గ్యాప్​ క్రియేట్ అయింది. దీంతో కొన్ని రోజులుగా మేయర్​ రెగ్యులర్​ గా ఆఫీస్​ కు రావడాన్ని కూడా తగ్గించేశారు. 

శానిటేషన్​ సిబ్బంది, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగుల్లో క్రమశిక్షణ లేకపోవడంతో ఇటీవల కమిషనర్​ పలు చర్యలు తీసుకున్నారు. విధులకు గైర్హాజరువుతున్న వారిని, బాధ్యతగా లేని వారిని కొందరిని సస్పెండ్ చేయడంతో పాటు, ఒకరిని విధుల నుంచి కూడా తప్పించారు. ఇలాంటి చర్యల విషయంలో మేయర్​ జోక్యం చేసుకోవడం, కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేయడం, తప్పు చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తుండడం లాంటి అంశాలు కమిషనర్​ కు కోపం తెప్పించాయని సమాచారం. పరిపాలనను నడిపించాల్సిన ఇద్దరు ముఖ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కార్పొరేషన్​ ఆఫీస్​ సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ పరిస్థితి.. 

ఖమ్మం కార్పొరేషన్​ ఆఫీస్​ మెయింటెనెన్స్​ టెండర్ల విషయంలో ఇటీవల మేయర్​, కమిషనర్​ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రస్తుతం మెయింటెనెన్స్​ కాంట్రాక్టర్​ గడువు ఈనెలాఖరుకు ముగియనుంది. గతేడాది రూ.26 లక్షలకు పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్​ 30 శాతం లెస్​ కు కోట్ చేసి రూ.18 లక్షలకు టెండర్​ దక్కించుకున్నారు. మార్చి రావడంతో మళ్లీ టెండర్లు పిలవాలని మేయర్​ సూచించగా, కమిషనర్​ మాత్రం మెప్మా (తాజాగా సెర్ప్ ఆధ్వర్యంలోకి వచ్చింది)​ ఆధ్వర్యంలో ఓ మహిళా సంఘానికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో ఫైల్ పై మేయర్​ సంతకం చేయలేదని సమాచారం. 

అయినా రూ.5 లక్షల్లోపు బిల్లుకు సొంతంగా కమిషనర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఏప్రిల్ ఆఫీస్​ మెయింటెనెన్స్​ ను ఓ మహిళా సంఘానికి అప్పగిస్తున్నారు. దీని ద్వారా 25 మంది సిబ్బందికి రూ.15,600 చొప్పున నెలకు రూ.4 లక్షల వరకు ఖజానాపై భారం పడనుంది. దీంతో ఏడాదికి రెట్టింపు ఖర్చు కానుంది. టెండర్​నిర్వహిస్తే ఎల్​1 బిడ్డర్​ గా నిలిచిన కాంట్రాక్టర్ ముందుగా ఖర్చులు, సిబ్బంది వేతనాలు చెల్లించి, బిల్లు పెట్టుకుంటారు. ​స్టేట్ గవర్నమెంట్ జనరల్ ​ఫండ్​ నుంచి కొద్దినెలలకు ఒకసారి కాంట్రాక్టర్ కు డబ్బులు జమవుతాయి. కానీ ఇప్పుడు ఆఫీస్​ నిధుల నుంచి చెల్లించే పరిస్థితి వచ్చింది. మేయర్​ కు పాలనపై పట్టులేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రతి పనిలో కాంట్రాక్టర్ల జోక్యం.. 

ఇక కార్పొరేషన్​ ఆఫీస్​ లో ఫైళ్ల మూమెంట్ సహా ప్రతి విషయంలో కాంట్రాక్టర్ల జోక్యం విపరీతంగా పెరిగింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది అటెండెన్స్​ విషయంలో జోక్యం చేసుకోవడం, నచ్చని వారికి ఆబ్సెంట్ వేయడం, శానిటేషన్​ సిబ్బందిని బదిలీల పేరుతో వేధిస్తున్న ఘటనలు బయటకు వస్తున్నాయి. మూడ్రోజుల కింద ఔట్​ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. కమిషనర్​ ను కలిసేందుకు మూడు, నాలుగు రోజుల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆయన ఛాంబర్​ ముందు ఎక్కువ సంఖ్యలో ఒకేసారి ట్యాబ్లెట్లు మింగి సూసైడ్​ అటెంప్ట్​ చేసింది.  చిన్న విషయాలకే షోకాజ్​ నోటీసులు ఇవ్వడం కూడా కామన్​ అయింది. 

ఇటీవల ఆఫీస్​ లో ఫైళ్లు కనిపించకుండా పోయిన విషయంలో ఒక రెగ్యులర్​ సిబ్బంది, మరో కాంట్రాక్ట్ ఉద్యోగికి, మరో కాంట్రాక్టర్​ కు క్రిమినల్ నోటీస్ ఇచ్చారు. రిటైర్​మెంట్ కు దగ్గరగా ఉన్న ఓ మహిళా ఉద్యోగిని సర్వీస్​ నుంచి తొలగించారు. దీంతో క్రమశిక్షణ పేరుతో పరిపాలనలో మానవీయ కోణం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు అధికారులు కామెంట్ చేస్తున్నారు. అనుభవరాహిత్యం, ఒంటెద్దు పోకడతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిగిలిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

 ఇక గతేడాది వరదల సమయంలో శాఖల మధ్య సమన్వయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడంతో అప్పుడు చేపట్టిన పనులపై ప్రస్తుతం విజిలెన్స్​ ఎంక్వైరీ నడుస్తోంది. మరోవైపు జనవరిలో మూడు సంక్షేమ పథకాల కోసం ఏర్పాటు చేసిన వార్డు సభలకు ఒక్కో దానికి రూ.20 వేల చొప్పున బిల్లులు మొత్తం రూ.13 లక్షల వరకు కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ, పాలనను ముందుకు తీసుకెళ్లడంలో మేయర్​ వైఫల్యంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మంత్రులు దృష్టిసారిస్తేనే..!

జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే విజయం సాధించారు. ఆయనతో పాటు మిగిలిన మంత్రులు దృష్టిసారిస్తేనే కార్పొరేషన్​ పాలన మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.