ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్​పర్సన్ మధ్య విబేధాలు

ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్​పర్సన్ మధ్య విబేధాలు

నిజామాబాద్, వెలుగు: అధికార బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్​పర్సన్ ​పద్మ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. పద్మ పక్షాన ప్రత్యక్ష పాలిటిక్స్ నడుపుతున్న ఆమె భర్త శరత్​రెడ్డిపై నమోదవుతున్న పోలీస్​ కేసులతో  క్యాడర్ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యే, చైర్​పర్సన్​ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు.  బీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లీస్ లీడర్లు ఎమ్మెల్యేపై గుర్రుతో శరత్​రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.

లోలోపల రగలి ఒక్కసారిగా..

రైస్ మిల్లరైన శరత్​రెడ్డి అయిదేళ్ల కింద పాలిటిక్స్​పై ఆసక్తితో మున్సిపల్​ ఎలక్షన్లలో పోటీచేశారు. భార్యాభర్తలిద్దరూ బీఆర్ఎస్  కౌన్సిలర్లుగా గెలిచారు. ఎమ్మెల్యే చైర్​పర్సన్ ​స్థానంలో పద్మను కూర్చోబెట్టారు. వైస్ చైర్మన్ పదవిని కూడా దక్కించుకోవాలని శరత్​రెడ్డి ​భావించాడు. కానీ ఆ పదవి ఎమ్మెల్యే సోదరుడు సోయెల్​కి దక్కింది.  వైస్ చైర్మన్ సోయెల్, చైర్​పర్సన్​ కుర్చీని డామినేట్ చేసేలా వ్యవహరించడంతో వివాదానికి బీజం పడింది. అప్పటి నుంచి లోలోపల రగులుతున్న ఇష్యూ, జటిలంగా మారి నువ్వా, నేనా అన్న స్థాయికి చేరింది. ఆ మధ్య మున్సిపల్ ​కమిషనర్​రామలింగం లీవ్​లో వెళ్లగా, ఆ స్థానంలో ఎమ్మెల్యే వ్యక్తి ఖమర్ అహ్మద్ రావడంతో  సీన్ ఒక్కసారిగా మారింది. తమ పవర్స్​కు చెక్​పెట్టడానికే ఇలా చేశారనే ఫీలింగ్​కు చైర్​పర్సన్ పద్మ, ఆమె భర్త శరత్​రెడ్డి వచ్చారు.

శివాజీ విగ్రహ స్థాపన నుంచి.. 

గతేడాది ఆరంభంలో బోధన్​లో శివాజీ విగ్రహస్థాపన రెండు వర్గాల మధ్య పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది. శాంతి పరిరక్షణకు వందల సంఖ్యలో పోలీసులు డే అండ్ నైట్ డ్యూటీ చేశారు. విగ్రహం రవాణా వెనుక శరత్​రెడ్డి హస్తముందని తేల్చిన పోలీసులు ఆయనపై కేసు పెట్టి అర్ధరాత్రి అదుపులో తీసుకున్నారు. దీని వెనుక ఎమ్మెల్యే పాత్ర ఉందని భావించిన శరత్ రెడ్డి ఎమ్మెల్యే తో విభేదించి, సొంతవర్గాన్ని డెవలప్​ చేసుకున్నారు.   మున్సిపాలిటీ ఎజెండాలోని అంశాలు ఆమోదం పొందేలా మెజార్టీ కౌన్సిలర్లపై పట్టు సాధించారు. సొంత ఈమేజ్ క్రియేట్ చేసుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఎమ్మెల్యేకు కంటగింపుగా మారాయి. ఎండాకాలం చలివేంద్రం ఏర్పాటు సమయంలో ఎమ్మెల్యే ఫొటో పెట్టకుండా ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే వర్గీయులు గొడవకు దిగగా, పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా వీరి మధ్య విభేదాలు బయటపెడుతున్నాయి.  ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లోనూ ఎమ్మెల్యేతో పడక, శరత్​రెడ్డి వర్గం దూరంగా ఉన్నారు. రెండు రోజుల కింద శరత్​రెడ్డిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. 

ఎమ్మెల్సీ కవితతో భేటీ.. 

ఎమ్మెల్సీ కవిత వర్గీయుడిగా శరత్​రెడ్డికి పేరుంది. పది రోజుల క్రితం కవిత పద్మ, శరత్​రెడ్డిని నిజామాబాద్​పిలిపించుకొని మాట్లాడారు. ఏం చర్చ జరిగిందనే విషయం బయటకు రాలేదు. మరోపక్క శరత్​రెడ్డికి మద్దతుగా ఉన్న కారణంగా అణిచివేత గురవుతున్నామని, పార్టీ ఉనికి ప్రమాదంగా మారిందని స్థానిక మజ్లిస్ లీడర్లు తమ హైకమాండ్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ టైమ్​లో అన్నీ చూస్తామని వారు భరోసా ఇచ్చినట్లు సమాచారం.