- గంప గోవర్ధన్ పేరు పలకలేదంటూ వేదికపైకి దూసుకొచ్చిన కార్యకర్తలు
- కేటీఆర్ సమక్షంలోనే వాగ్వాదం, తోపులాట
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే లీడర్లు గొడవ పడడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు, మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.
ముందుగా సమన్వయ కమిటీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో సీనియర్ నేత తిర్మల్‌రెడ్డి మాట్లాడుతూ వేదికపై ఉన్న కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ పేరు పలికి, మాజీ విప్ గంప గోవర్ధన్ పేరు పలకలేదు. దీంతో కార్యకర్తలు ఆందోళనకు దిగి, వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వినిపించుకోకుండా గంప గోవర్ధన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.
దీంతో తిర్మల్‌రెడ్డి గంప గోవర్ధన్ పేరు కూడా చెప్పడంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. తర్వాత తిర్మల్‌రెడ్డి మాట్లాడుతుండగా మరికొందరు కార్యకర్తలు వేదికపై ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఈ టైంలో వేదిక మీద నుంచి పక్కకు జరగాలని నర్సయ్య అనే నాయకుడు చెప్పడంతో లీడర్లు, కార్యకర్తలు ఆయనతో వాగ్వావాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. స్పందించిన కేటీఆర్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించడంతో ఎక్కడివారు అక్కడ కూర్చున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గంప గోవర్ధన్ నాయకత్వంలోనే ముందుకెళ్తామని, సమన్వయ కమిటీ కొనసాగుతుందని, ఇందులోకి మరికొందరిని కూడా తీసుకుంటామని చెప్పారు.