- ప్రజాభిప్రాయం చెప్పాలని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
- కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బోర్డు విలీనం సాధ్యమేనా ?
- బల్దియా, కంటోన్మెంట్ ల మధ్య పన్నుల్లో వ్యత్యాసాలు
కంటోన్మెంట్, వెలుగు: “ బల్దియాలో కంటోన్మెంట్‌ను విలీనం చేయాలని ఆ ప్రాంత ప్రజలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వారి వాదనలతో నేను ఏకీభవిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కూడా చెప్పండి. ” అంటూ కేటీఆర్ బుధవారం ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే బోర్డు విలీనం సాధ్యమేనా..? ఆర్మీ ప్రాంతాన్ని విలీనం చేయొచ్చా.. ? కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల బాధ్యత ఎంత..? కీలక నిర్ణయం కేంద్రానిదా..? రాష్ర్టానిదా..? అనే అంశాలపై చర్చ మొదలైంది. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ బోర్డును బల్దియాలో కలపాలనే డిమాండ్కొత్తకాలంగా ఉంది. బల్దియాకు , కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని తాగునీటి బిల్లు, ఇంటిపన్ను, నీటి సరఫరా, అభివృద్ధి తదితర విషయాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. బల్దియాతో పోలిస్తే కంటోన్మెంట్ప్రజలు చాలా రకాలుగా నష్టపోతున్నారు. సిటీలో మధ్యలో ఉన్నా బోర్డు పరిధిలోని ప్రజలు రెండోస్థాయి పౌరులుగా పరిగణిస్తున్నారని, విలీనం చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు కొంతకాలంగా వాదిస్తున్నారు.
1998లోనే వచ్చిన డిమాండ్
దేశంలో 62 కంటోన్మెంట్బోర్డులు ఉండగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జనాభా, విస్తీర్ణం, వైశాల్యంలో అన్నిటికంటే పెద్దది. గతంలో ఈ బోర్డు పరిధి అల్వాల్, బోయిన్పల్లి, తార్నాక వరకు విస్తరించి ఉండేది. పలు పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు వచ్చిన నేపథ్యంలో 40 ఏళ్ల కిందట తార్నాక ప్రాంతాన్ని బోర్డు పరిధి నుంచి వేరు చేసి బల్దియాలో కలిపేశారు. బోర్డును కూడా పూర్తిగా బల్దియాలో విలీనం చేయాలనే డిమాండ్ 1998లో ప్రజల నుంచి రాగా అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సాయన్న అభ్యర్థన మేరకు సీఎం చంద్రబాబు కేంద్ర రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన ప్రధాని వాజ్‌పేయితో చర్చించగా బోర్డు విలీనంపై సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనిపై బోర్డు పాలకమండలి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అప్పుట్లోనే ప్రక్రియ ముగిసేది. కానీ పాలక మండలి సభ్యులు వ్యతిరేకించడంతో తీర్మానం ఆమోదం పొందకుండా ఆగిపోయింది.
కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే..
బోర్డును బల్దియాలో విలీనం చేయాలంటే ముందుగా రాష్ర్ట ప్రభుత్వం ఒక నివేదిక రూపొందించి కేంద్రానికి పంపాలి. దీనిపై కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్డు విలీనానికి రాష్ర్టం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతుందా..? ఒకవేళ పంపిస్తే దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకుంటుందా..? అనే అనుమానాలు వస్తున్నాయి.