- ఎమ్మెల్యేలు,ఛైర్మన్లు, కౌన్సిలర్ల మధ్య రచ్చకెక్కుతున్న విభేదాలు
- నిధులు, విధులు, మున్సిపాలిటీల్లో కొలువుల కోసం గొడవలు
- అధికార, ప్రతిపక్ష అన్న తేడా లేకుండా ఏకతాటి పైకి కౌన్సిలర్లు
నల్గొండ, వెలుగు : మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో అర్బన్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. మరో రెండేళ్ల పదవీకాలం మాత్రమే మిగిలి ఉండడంతో తాడోపేడో తేల్చుకునేందుకు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. చైర్మన్లతో గొడవలు పెట్టుకోవడం కంటే ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తే తమ పని ఈజీగా అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల కౌన్సిలర్లకు నయాపైసా లాభం లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు, తాజాగా జరుగుతున్న పనుల్లో కౌన్సిలర్లను భాగస్వాములను చేయకపోవడాన్ని జీర్ణించుకో లేకపోతున్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల కారణంగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోంది. కానీ ఎక్కడా కూడా కౌన్సిలర్ల జోక్యం లేకపోవడం, పాలకవర్గంతో సంప్రదింపులు లేకుండా పనులన్నీ ఏకపక్షంగా జరిగిపోతున్నాయి. దీంతో కౌన్సిలర్లు మండిపడుతున్నారు. చైర్మన్లకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడదామన్నా అవకాశం లేకుండా పోయింది. అవిశ్వాస తీర్మానం గడువును కూడా ప్రభుత్వం నాలుగేళ్లకు పెంచింది. దీంతో ఇప్పట్లో చైర్మన్లను టార్గెట్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్న కౌన్సిలర్లు ఏకంగా ఎమ్మెల్యేలకే గురి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలనే అదునుగా భావించి, గట్టిగా ఫైట్ చేస్తే తప్ప నిధులు రావని, పనులు జరగవన్న ఆలోచనతోనే కౌన్సిలర్లు బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే దేవరకొండ మున్సిపల్ పంచాయితీ హైకమాండ్ వద్దకు చేరింది. హాలియాలో అధికార పార్టీ కౌన్సిలర్లు జనరల్ బాడీ మీటింగ్‌ను బైకాట్ చేశారు. నల్గొండలో అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అగ్రిమెంట్ గడువు ముగియడంతో...
దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవీకాలాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని చైర్మన్ ఆలపల్లి నర్సింహ, కౌన్సిలర్ హనుమంత్ వెంకటేశ్‌గౌడ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ గడువు దాటి ఐదు నెలలు అవుతోంది. దీంతో నర్సింహను పదవి నుంచి తప్పించి వెంకటేశ్‌గౌడ్‌కు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇక్కడ కుల సమీకరణాలు తెరపైకి వచ్చాయి. దేవరకొండలో ఆర్యవైశ్యులు బలంగా ఉండడం, ఆ వర్గానికి ఎలాంటి పదవి దక్కకపోవడంతో గతంలో చైర్మన్ పదవి ఇచ్చారు. దేవరకొండ ఎంపీపీ యాదవులకు, జడ్పీటీసీ గౌడ్స్‌కు కేటాయించారు. దీంతో ఓసీ కోటాలో మున్సిపల్ చైర్మన్‌గా నర్సింహను ఎన్నుకున్నారు. కానీ గతంలో పార్టీ పెద్దల సమక్షంలోనే జరిగిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని వెంకటేశ్‌గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ నాయకులు అందరూ కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వివరించారు. వారం, పది రోజుల్లో చైర్మన్ క్యాండిడేట్ మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చైర్మన్ నర్సింహ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో దేవరకొండ రాజకీయం రసకందాయంలో పడింది.
ప్రయారిటీ ఇవ్వడం లేదంటూ...
నల్గొండ మున్సిపాలిటీల్లో అధికార పార్టీలోని ఓ వర్గం కౌన్సిలర్లు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లకు ఇచ్చిన ప్రయారిటీ తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చినట్టుగానే తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు గతంలో చైర్మన్ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు బాకీ ఉన్న రెండున్నర లక్షలు చెల్లించాలని పట్టుబడుతున్నారు.వార్డుల్లో కౌన్సిలర్లకు కేటాయించిన నిధులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, అధికారులెవరూ తమ మాటకు విలువ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హాలియా మున్సిపాలిటీలో...
హాలియా మున్సిపల్ చైర్‌పర్సన్ పార్వతమ్మపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఫండ్స్ కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ కౌన్సిలర్లు, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇటీవల మున్సిపల్ మీటింగ్‌ను బహిష్కరించారు. మరోవైపు ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ మధ్య విబేధాలు కూడా రచ్చకెక్కాయి. నిధుల పంపకాల్లో తేడాలు రావడమే గొడవలకు దారితీస్తోందని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అండతోనే కౌన్సిలర్లు తమపైన తిరుగుబాటు చేస్తున్నారని చైర్‌పర్సన్ వర్గం ఆరోపిస్తోంది. కౌన్సిలర్లు జనరల్ బాడీ మీటింగ్‌ను బహిష్కరించడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని అంటున్నారు. ప్రస్తుతం హాలియాలో అధికార, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఏకమై చైర్మన్ సీటుకు ఎసరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.