కామారెడ్డి, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని సీఎంను డిమాండ్ చేస్తున్నారు. ‘‘కేసీఆర్.. ముందు మా సంగతి తేల్చండి’’ అంటూ వారు ఆందోళనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు పొలిటికల్ పార్టీలకే కాదు, పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలనుకునే వివిధ సామాజికవర్గాల వారికి కూడా ఓ కేంద్రంగా మారింది. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో కామారెడ్డిపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఎన్నికలు సమీపిస్తుండడం, కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆందోళనలు నిర్వహిస్తే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లవచ్చని వివిధ సామాజికవర్గాల వారు భావిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ముదిరాజ్‌లు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీల్లో ఉన్న లబాన్ లంబాడీలు తమను ఎస్టీలుగా మార్చాలన్న డిమాండ్‌తో కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 30న కామారెడ్డిలో భారీ ర్యాలీ చేపడతామని వారు ప్రకటించారు. అలాగే రెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సభ నిర్వహిస్తామని రెడ్డి సంఘం నేతలు ప్రకటించారు.
ALSO READ: ప్రతిపక్షాలకు..సెప్టెంబర్ షాక్‌లు
సమస్యలు పరిష్కరించకపోతే .. 1,016 నామినేషన్లు వేస్తం
కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో లబాన్ లంబాడీలు ఉన్నారు. వారిని ఆయా ఏరియాల్లో లబాన్, మధుర, కాయితీ, జుట్టు లంబాడీలుగా పిలుస్తుంటారు. వీరు ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్నారు. తమను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో కొద్ది రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. మొదట ఎస్టీలోనే ఉండి రిజర్వేషన్లతో విద్య, ఉద్యోగావకాశాలు పొందారు. 1986లో వారిని ఎస్టీ నుంచి బీసీ జాబితాలోకి మార్చారు. ఎస్టీ వర్గాలకు అందే ఫలాలు వారికి దక్కటం లేదు. మళ్లీ తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని లంబాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యను పరిష్కరిస్తానని దివంగత సీఎం వైఎస్ఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లబాన్ లంబాడీలు తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఎన్నికల్లోనూ సీఎం కామారెడ్డిలో ప్రచారానికి వచ్చినప్పుడు వారిని ఎస్టీ జాబితాలోకి మారుస్తామని హామీ ఇచ్చారు.
చెల్లప్ప కమిషన్ కూడా వారి స్థితిగతులను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపింది. ఆ తర్వాత పక్రియ ముందుకు సాగలేదు. ఎస్టీలకు ఇటీవల ప్రభుత్వం పోడు పట్టాలు అందజేసింది. లబాన్ లంబాడీలు కూడా తాము నివసించే ఏరియాల్లో దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నా ఎస్టీల్లో లేనందున వారికి పోడు పట్టాలు ఇంత వరకూ రాలేదు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎస్టీలుగా గుర్తించాలని, పోడు పట్టాలు ఇవ్వాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొద్ది రోజులుగా లంబాడీలు ఆందోళన చేస్తున్నారు. కామారెడ్డి కలెక్టరేట్ఎదుట ఇటీవలే ధర్నా చేశారు. హైవేపై రాస్తారోకోతో పాటు, వారు ఎక్కువగా ఉన్న గాంధారి మండల కేంద్రంలోనూ భారీ ర్యాలీ నిర్వహించారు. తమ నిరసన ప్రదర్శనల్లో భాగంగా ఈనెల 30న కామారెడ్డిలో మరోసారి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే కామారెడ్డిలో 1,016 నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో వారు లేకపోయినా పక్కన ఉన్న ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఆ సామాజికవర్గం వారు ఉన్నారు.
రెడ్డి కార్పొరేషన్ కోసం పాదయాత్ర
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఆందోళనకు రెడీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్న కామారెడ్డి నియోజకవర్గం వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తామని రెడ్డి సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. వచ్చే నెల 29 నుంచి నవంబర్ 5 వరకు ఈ పాదయాత్ర ఉంటుందన్నారు. 5న ముగింపు సభ కామారెడ్డిలో నిర్వహిస్తామన్నారు. 2018లో కేసీఆర్ ఇచ్చిన హామీ సాధన కోసమే పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు.
డిమాండ్లపై గళం విప్పుతున్న ముదిరాజ్ లు
తమకు అన్ని పార్టీలు సీట్లు కేటాయించడంతో పాటు, తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండుతో ఈనెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముదిరాజ్‌లు ధర్మయుద్ధం ర్యాలీ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేల మంది ముదిరాజ్‌లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అధికార బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో తమ కులానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంపై ఆ సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ జనాభాకు అనుగుణంగా ఆయా పార్టీలు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తగినన్ని సీట్లు కేటాయించాలనిడిమాండ్ చేశారు. అలాగే తమను బీసీ డీ నుంచి బీసీ ఏ జాబితాలోకి మార్చాలని, నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని, రూ.10 వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, భూమిలేని వారికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.