- వికారాబాద్ జిల్లా నాగారం పశువైద్యశాలలో ఘటన
వికారాబాద్, వెలుగు: జిల్లాలోని ధారూర్ మండలం నాగారంలోని పశు వైద్యశాలలో వైద్యుడు సమయానికి రాక అనారోగ్యానికి గురైన పశువులకు చికిత్స అందడం లేదు. గ్రామానికి చెందిన దశరథ్ మేక అనారోగ్యానికి గురవగా బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ లేకపోవడంతో సమయానికి చికిత్స అందక మేక చనిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన దశరథ్ చనిపోయిన మేకను ఆస్పత్రి బోర్డుకు కట్టి నిరసన తెలిపారు.
పశు వైద్యుడు సురేందర్ నాయక్ సమయానికి రాకపోవడంతో పశువులకు సరైన చికిత్స లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మేక మృతి చెందిన ఘటన తన దృష్టికి వచ్చిందని జిల్లా వైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ పూర్ణ చందర్ రావు తెలిపారు. ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.