ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన

అకాల వర్షం అన్నదాతకు తీరని శోకాన్ని మిగిల్చింది. అరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలవడంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. మార్కెట్ లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. తమ కళ్ల ముందే ధాన్యం కొట్టుకొని పోవడంతో రైతు దిగాలు పడుతున్నారు. అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన చేపట్టారు. 

కొనుగోలు చేయాలె..

వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్టలో  రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీకి తాళం వేసుకొని లోపల తమను తాము నిర్భంధించుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీ బుధవారం అర్థరాత్రి నుంచి గ్రామపంచాయతీ లోపల రైతులు ఆందోళన చేస్తున్నారు. గతంలో జిల్లా కలెక్టరేట్ ముందు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని ధర్నా చేస్తే.. రెండు రోజుల్లో పంటను కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి ఆ హామీని నిలబెట్టుకొలేదన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  

పంట నష్టం..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అకాల వర్షాలకు మొక్కజొన్న, మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో దాదాపు 4 వేల నుంచి 5 వేల హెక్టార్లలో మామిడికాయ రాలిపోయింది. రెండు వేల పైచిలుకు ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.