- ఆగుతూ సాగుతున్న వర్క్స్
- పట్టించుకోని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు
- గోసపడుతున్న విద్యార్థులు
ఆసిఫాబాద్,వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ‘మన ఊరు.. మన బడి’ ప్రొగ్రామ్ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 20 వరకు వర్క్స్ కంప్లీట్ చేయాలన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. గవర్నమెంట్ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆసిఫాబాద్ జిల్లాలో 735 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ‘మన ఊరు.. మన బడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లలో వంటగది, విద్యుత్, డైనింగ్ హాల్, బౌండరీ వాల్, టాయిలెట్లు, సైన్స్, డిజిటల్, కంప్యూటర్ ల్యాబ్‌లు, పెయిటింగ్ తదితర 12 రకాల అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. మొదటి విడతలో జిల్లాలో 251 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందు కోసం రూ. 34.43 కోట్లు మంజూరు చేశారు. కానీ... ఇంత వరకు కేవలం ఐదు స్కూళ్లలోనే పనులు పూర్తయ్యాయి. చేపట్టాల్సిన పనులు గుర్తించడం, అనుమతుల్లో జాప్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.
20 నాటికి కంప్లీట్ డౌటే..
పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులన్నీ ఈనెల 20 నాటికి పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు దగ్గరుండి పనులు చేయాలని సూచించారు. అయినా కేవలం ఐదు స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.
ఇబ్బందిగా ఉంది..
నల్లాలు లేక బోరు నీళ్లు తాగుతున్నాం. సార్ మోటార్ వేస్తే మేమంతా బాటిళ్లు నింపుకుం టున్నాం. నల్లాలు ఉంటే ఎప్పటి కప్పుడు నీళ్లు పట్టుకుంటాం. మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. - రాపర్తి వర్ష, ఐదో తరగతి, ఎంపీపీఎస్, దహెగాం
ఇబ్బందిగా ఉంది..
నల్లాలు లేక బోరు నీళ్లు తాగుతున్నాం. సార్ మోటార్ వేస్తే మేమంతా బాటిళ్లు నింపుకుం టున్నాం. నల్లాలు ఉంటే ఎప్పటి కప్పుడు నీళ్లు పట్టుకుంటాం. మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. - రాపర్తి వర్ష, ఐదో తరగతి, ఎంపీపీఎస్, దహెగాం
- దహెగాంలోని ఎంపీపీఎస్ స్కూల్ లో 71 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇక్కడ విద్యుత్ పనులు తప్ప... మిగతావన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్ వాల్, అడిషనల్ క్లాస్ రూమ్స్ పనులు ఇంకా ప్రారంభించలేదు. టాయిలెట్స్, కిటికీల రిపేర్ చేయలేదు.
- జైనూర్ మండలం గౌరి, మండల కేంద్రంలోని హరిజనవాడ ఎంపీపీఎస్ స్కూళ్లలో పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. ఎలక్ట్రిక్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. హరిజనవాడలో నల్లాలు ఫిట్ చేసి వదిలేశారు. కిటికీలకు తలపులు లేవు. కాంపౌండ్ వాల్ పనులు స్టార్ట్ కాలేదు.
- తిర్యాణి మండలం భీమారం మండల పరిషత్ స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 65 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఎలక్ట్రికల్, టైల్స్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. టాయిలెట్స్ రూమ్స్, నల్లాలు, చైర్స్, బిల్డింగ్‌కు కలర్, కాంపౌండ్‌వాల్ పనులు ముందుకు సాగడంలేదు.