- చాలా ఏరియాల్లో 2 నెలలుగా ఇదే సమస్య
- కొత్తగా నిర్మించిన కొద్ది రోజులకే డ్యామేజ్
హైదరాబాద్, వెలుగు: సిటీలో రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి. జులైలో భారీగా వర్షాలు పడిన తర్వాత గత నెల కాస్త తెరిపినిచ్చినప్పటికీ మళ్లీ ఈ నెల మొదటి వారం నుంచి వానలు దంచికొట్టాయి. జులైలో కురిసిన వానలకు చాలా చోట్ల రోడ్లు దెబ్బతినగా.. మరికొన్ని ప్రాంతాల్లో గతుకులమయంగా మారాయి. వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో ఆ రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రోడ్లకు రిపేర్లు చేయడం లేదు. ఇంకొన్నిచోట్ల నెల, రెండు నెలలుగా అలాగే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లకు రిపేర్లు చేసినా కూడా కొన్నాళ్లకే మళ్లీ డ్యామేజ్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సిటీలో రోడ్ల నిర్మాణానికి, రిపేర్ల కోసం బల్దియా ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. సరైన నాణ్యత పాటించకపోవడం వల్ల చిన్న వానకే గతుకులు, గుంతలు తేలి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. గ్రేటర్లో 9,013 కి.మీ విస్తీర్ణంతో రహదారులు ఉండగా.. అందులో 2,846 కి.మీ మేర బీటీ రోడ్లు, 6,167 కి.మీ మేర అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ అంతర్గత రోడ్లు మరింత అధ్వానంగా మారాయి. చాలా కాలనీల్లో కొన్నేళ్లుగా రోడ్లు వేయకపోవడంతో పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఏజెన్సీలకు అప్పగించిన 709 కి.మీ పరిధితో పాటు మరికొన్నిచోట్ల మినహా చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో వాహనదారులు సిటీ రోడ్లపై జర్నీ చేసేందుకు భయపడుతున్నారు.
క్వాలిటీని పట్టించుకోవట్లే..
రోడ్ల నిర్మాణం, రిపేర్ల సమయంలో అధికారులు క్వాలిటీపై దృష్టి పెట్టడం లేదు. క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతోనే సమస్య ఏర్పడుతున్నట్లు ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా నాణ్యత పాటించడంలో జీహెచ్‌ఎంసీ విఫలమవుతోందన్న ఆరోప
ణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా రోడ్ల మెయిటెనెన్స్ కోసం బల్దియా సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణాల్లో క్వాలిటీని పట్టించుకోకపోవడం వల్లే అవి దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం రోడ్ల పరిస్థితిని చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసిన కొన్నాళ్లకే కరాబవుతున్నాయి. దీని బాధ్యత క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులపై ఉంది. నెల, రెండు నెలల కింద రిపేర్లు నిర్వహించిన టోలిచౌకి, మాసబ్ ట్యాంక్, అఫ్జల్ గంజ్, చందానగర్, చార్మినార్, ఎల్ బీనగర్, సరూర్ నగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఇదే సమస్య ఉన్నట్లు ఆయా రూట్లలో వెళ్లే వాహనదారులు, స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ప్రయాణించాలంటే ఎక్కడ గుంత ఉందో తెలియక భయంతో వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు అంటున్నారు.