అధికారుల నిర్లక్ష్యం : బర్త్, డెత్ సర్టిఫికెట్స్ జారీలో ఇబ్బందులు

అధికారుల నిర్లక్ష్యం : బర్త్, డెత్ సర్టిఫికెట్స్ జారీలో ఇబ్బందులు

హైదరాబాద్ : పుడితే బర్త్ సర్టిఫికెట్, చనిపోతే డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇవి పొందడం పౌరుల హక్కు. వీటిని ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. అయితే అధికారుల తీరుతో గ్రేటర్ హైదరాబాద్ లో బర్త్, డెత్ సర్టిఫికెట్స్ పొందడంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కొత్త విధానం పేరుతో సిటిజన్స్ సర్వీస్ సెంటర్లలో సర్టిఫికెట్ల జారీ నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. బర్త్ అండ్ డెత్ రిజిష్ట్రేషన్ యాక్ట్ 1969 ప్ర కారం దేశంలో జరిగే  జననాలు, నిర్జీవ జననాలు, మరణాలు  అవి జరుగుతున్న ప్రదేశంలో తప్పనిసరిగా నమోదు చేయ్యాలి. ఇందుకోసం జాతీయ , రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ప్రభుత్వం అధికారులను నియమించింది. వారి ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు సేకరిస్తుంది. పౌరులు అడిగిన వెంటనే బర్త్, డెత్ సర్టిఫికెట్స్ ఇస్తుంటారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో అసిస్టింట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ పరిధిలో హెల్త్ అసిస్టెంట్లు జనన, మరణ వివరాలు నమోదు చేస్తారు. పౌరులకు సర్టిఫికెట్స్ ఇస్తారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సిటిజన్ సర్వీస్ సెంటర్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఒక్కో సర్టిఫికెట్ కు 20 రూపాయలు వసూలు చేసేవారు. కొంతకాలంగా జీహెచ్ఎంసీ ధృవ పత్రాల ముద్రణ నిలిపివేయడంతో పూర్తిగా పౌరులు మీ సేవా సెంటర్ల నుంచి సర్టిఫికెట్లు పొందాల్సి వస్తోంది. గతంలో 20 రూపాయలు చెల్తిస్తే సరిపోయేది. ఇప్పుడు మీ సేవా సెంటర్ నిర్వాహకులు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఏటా బర్త్ సర్టిఫికెట్లు లక్షా 50 వేలు, డెత్ సర్టిఫికెట్లు 60 వేల వరకు జారీ చేస్తారు. అయితే వివిధ అవసరాల కోసం రెండు బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్, బ్యాంకులు వంటి ఆఫీసుల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలి కాబట్టి దాదాపు 10 డెత్ సర్టిఫికెట్స్ అవసరం ఇలా ప్రతి ఏటా బర్త్ సర్టిఫికెట్స్ 3 లక్షలు,  డెత్ సర్టిఫికెట్స్ 6 లక్షలు జారీఅవుతాయి. మొత్తంగా 9 లక్షల పత్రాల కోసం 30 రూపాయల చొప్పున 2 కోట్ల 70 లక్షల రూపాయలు గ్రేటర్ హైదరాబాద్ పౌరులు ఖర్చు చేయాల్సి వస్తోంది. నిజానికి బర్త్, డెత్ సర్టిఫికెట్స్ సిటిజన్స్ సర్వీస్ సెంటర్లలో ఇస్తే అంత ఖర్చు చెయ్యాల్సిన అవసరం పౌరులకు ఉండదు. పైగా అది బల్దియా ఖజానాలో జమ అవుతుంది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయంతో పౌరుల జేబులకు చిల్లు పడ్తోంది. అటు జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పడ్తోంది.

ఇప్పటివరకు సిటిజన్ సర్వీసెస్ సెంటర్లలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు తాత్కాలికంగా నిలిపివేసిన జీహెచ్ఎంసీ… రానున్న రోజుల్లో పూర్తిగా మీ సేవా ద్వారానే ధృవపత్రాలు అందించాలని డిసైడ్ అయింది. ఈ విధానం కోసం ఇప్పటికే 30 సిటిజన్ సర్వీస్ సెంటర్లలో సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఈ నెల ప్రారంభం నుండి బల్దియా కార్యాలయాల్లో దాదాపు 10 వేలకు పైగా బర్త్, డెత్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. సర్టిఫికెట్ల జారీ నిలిచిపోవడంతో పౌరులు ఇబ్బందులు పడ్తున్నారు. హైదరాబాద్ లో హెల్త్ టూరిజం పెరగడంతో ఇక్కడికి వచ్చే విదేశీ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇక్కడికి వచ్చిన పెషేంట్లు అనారోగ్యంతో చనిపోతే డెడ్ బాడీని వారి స్వదేశానికి తరలించాలంటే డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి. కొత్త విధానం ప్రకారం మీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకుంటే 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది విదేశీయులకు భారంగా మారనుంది. పాతవిధానంలో ఎవరైనా చనిపోతే గంటల వ్యవధిలోనే సర్టిఫికెట్లు ఇచ్చేవారు.

గ్రేటర్ పరిధిలో జన్మించిన వారికి బర్త్ సర్టిఫికేట్లను  ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిడ్డ పుట్టిన కొద్ది రోజుల్లోనే ఇంటికే పంపిస్తామని గతంలో నిర్ణయించింది జీహెచ్ఎంసీ. ఈకార్యక్రమాన్ని కొద్దిరోజుల్లోనే అటకెక్కించారు అధికారులు. మరోవైపు అప్పుడే పుట్టిన బిడ్డకు ఆసుపత్రి నుండి డిశ్చార్జీ అయ్యేటప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినా అదికూడా అమలుకు నోచుకోలేదు. ఆసుపత్రుల్లో జారీ చెయ్యడానికి పత్రాలు లేకపోవడంతో ఈ ప్రక్రియకూడా నిలిచిపోయింది.  బర్త్, డెత్ సర్టిఫికెట్ల సంగతి పక్కన పెడితే జీహెచ్ఎంసీ సిటిజన్స్ సర్వీస్ సెంటర్లలో ఎలాంటి ధృవపత్రాలు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్ల ప్రింటింగ్ ను నిలిపివేయడంతో బల్దియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, వాటిని మీ సేవా సెంటర్లలోనే తీసుకోవాల్సి వస్తోంది. అలా జీహెచ్ఎంసీతో పాటు మీసేవాలో కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది.  ఇక లేటెస్ట్ గా సేవల విస్తరణ పేరుతో  జీహెచ్ఎంసీ తన ప్రాథమిక విధుల నుండి పూర్తిగా తప్పుకుంటోంది. దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎసీలో హెల్త్ విభాగాధిపతులు మారినప్పుడల్లా కొత్త విధానం తీసుకురావడం, కొన్ని రోజుల్లో దానిని అటకెక్కించడం సాధారణంగా మారింది. జననమరణాల ధృవీకరణ  ప్రక్రియ నిరంతరం ఉంటుంది. అలాంటి వ్యవస్థను పటిష్టం చెయ్యడం వదిలేసి ఇష్టానుసారం వ్యవహరించడంతో ఇబ్బందులు ఎదురౌతున్నాయి.