మంచిర్యాల - వరంగల్ గ్రీన్‌ఫీల్డ్​ హైవేకు భూసేకరణ కష్టాలు

  •     గుట్టుచప్పుడు కాకుండా సర్వే చేస్తున్న అధికారులు 
  •     ఎకరానికి రూ.3.3లక్షలు ఇస్తామంటున్న సర్కార్​
  •     మార్కెట్​ రేట్​ ఇస్తేనే భూములిస్తామంటున్న రైతులు
  •     కోర్టును ఆశ్రయించిన బాధితులు 

పెద్దపల్లి, వెలుగు: గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​  ​హైవేకు ఆటంకాలు తప్పడం లేదు. హైవే నిర్మాణానికి రెండు పంటలు పండే భూములివ్వమని రైతులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా అధికారులు సర్వే చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఎకరానికి రూ.3.3 లక్షలిస్తామని సర్కార్​ చెబుతుండగా ఎకరానికి రూ.20 లక్షలకు తగ్గతే ఒప్పుకునేది లేదని కొందరు రైతులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొంతమంది రైతులు కోర్టును ఆశ్రయించారు. భూసేకరణ లేట్​ కావడంతో  నిర్మాణ అంచనాలు రూ.7,612 కోట్ల నుంచి రూ.10,573 కోట్లకు చేరాయి.  తెలంగాణలో మంచిర్యాల జిల్లా నుంచి మంథని మీదుగా వరంగల్ జిల్లా​వరకు 112 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించనున్నారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో భూసేకరణ కష్టంగా మారింది. 

రాష్ట్ర సర్కార్​ తీరుతోనే లేటు 

భూసేకరణ విషయంలో రాష్ట్ర సర్కార్​నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.  మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 112 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 1767 ఎకరాలు సేకరించాల్సి ఉంది.  అయితే రైతులను సంప్రదించకుండానే అధికారులు భూసేకరణకు ప్రయత్నిస్తున్నారు. దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 1000 ఎకరాలు దాటితే పబ్లిక్​ హియరింగ్​ నిర్వహించాలి. కానీ మూడు జిల్లా పరిధిల్లో 1767 ఎకరాలు సేకరిస్తున్నందున పబ్లిక్​హియరింగ్​అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీనికి రైతులు ఒప్పుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లాకు చెందిన అధికారులు గతంలో ఒకటి, రెండుసార్లు రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ చట్ట ప్రకారం తమకు ఎంత పరిహారం వస్తుందో చెప్పకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ. 3.3లక్షలు పరిహారం ఇచ్చే చాన్స్ ఉందని అధికారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టౌన్లు, మండల కేంద్రాల్లో గుంటకు రూ.8లక్షలు పైగా ఉందని, అలాంటిది ఎకరాకు 3.3లక్షలంటే ఒప్పుకోమని రైతులు తేల్చి చెబుతున్నారు. ఈ లెక్కన వీరికి రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని గ్రామాల్లో ఎకరానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్​చేస్తున్నారు. వారం కింద అధికారులు  సమాచారం లేకుండా రైతుల భూముల్లో సర్వేలు చేశారు. ఆదివారంపేటకు చెందిన రైతులు కొందరు కోర్టును ఆశ్రయించారు. మరికొన్ని గ్రామాల రైతులు కోర్టుకు పోయేందుకు సిద్ధమవుతున్నారు. 

పెరుగుతున్న అంచనాలు 

రైతులు వ్యతిరేకిస్తుండడంతో భూసేకరణ ఆలస్యమవుతోంది. దీంతో నిర్మాణ అంచనాలు పెరుగుతున్నాయి.  ఈ ప్రాజెక్ట్​ను 2020 డిసెంబర్‌‌లో ప్రతిపాదించగా ఇప్పటివరకు పనులు స్టార్ట్​కాలేదు. ఈ గ్రీన్‌ ఫీల్డ్​హైవే నిర్మాణానికి రూ. 7,612 కోట్లు అంచనా వేయగా భూసేకరణ లేటు అవడంతో నిర్మాణ వ్యయం రూ.10,573 కోట్లకు చేరింది. ప్రస్తుతం మంచిర్యాల నుంచి వరంగల్​వెళ్లాలంటే గోదావరిఖని, కరీంనగర్‌‌ మీదుగా 160 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ హైవే పూర్తయితే 60 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతోపాటు జమ్మికుంట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు రోడ్డు కనెక్టివిటీ పెరగనుంది. 

 భూసేకరణ ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది

గ్రీన్‌ఫీల్డ్​రోడ్డు కోసం ఇంకా భూసేకరణ ప్రాసెస్​ నడుస్తోంది. ఆదివారంపేటకు చెందిన  రైతులు కోర్టును ఆశ్రయించారు. 3జీ అవార్డు ఎంక్వైరీ ప్రాసెస్​ కొనసాగుతోంది. రైతుల అంగీకారంతోనే భూసేకరణ చేపడతాం. 
–  వీరబ్రహ్మచారి, ఆర్డీవో, మంథని

భూములిచ్చి ఎట్లా బతుకుడు.. 

నేషనల్​ హైవే కింద మా భూములు తీసుకుంటామని సర్కార్​ చెబుతోంది. రెండు పంటలు పండే భూములిచ్చి ఎట్లా బతికేది. మాతో ఎలాంటి చర్చలు లేకుండా భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. సర్కార్​ న్యాయం చేస్తదనే నమ్మకం లేదు.
–   నూనేటి కృష్ణ, ముత్తారం, పెద్దపల్లి జిల్లా