- గత అక్టోబర్ నుంచి నిలిచిపోయిన కోడిగుడ్ల బిల్
- నవంబర్ నుంచి 9, 10 స్టూడెంట్స్ బిల్స్ బకాయి
- వంటవారి గౌరవ వేతనం కూడా అంతే..
- ప్రతి నెలా రూ.కోటిన్నర అప్పుతో ఏజెన్సీల నిర్వహణ ఎలా..?
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో సర్కారు, ఎయిడెడ్ బడులకు మిడ్ డే మీల్స్ రెడీ చేసే ఏజెన్సీలు అప్పుల పాలవుతున్నాయి. కుటుంబ పోషణ కోసం ఉపాధిగా ఎంచుకున్న వంటలు వడ్డీల భారం మోపుతున్నాయి. గవర్నమెంట్ నుంచి క్రమంగా బిల్స్ రాకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన బిల్లులను కాంగ్రెస్ సర్కారు రూ.5 కోట్ల దాకా చెల్లించినా ఇంకా మొత్తం క్లియర్ కాలేవు
ఇంకా రావాల్సింది రూ.5 కోట్లు
జిల్లాలోని 1,234 స్కూల్స్‌లో 1.02 లక్షల స్టూడెంట్స్ కోసం మిడ్డే మీల్స్ స్కీం కొనసాగుతోంది. 1,164 ఏజెన్సీల కింద మొత్తం 2,524 మంది వంటవారు, సహాయకులు ప్రతి రోజూ వంట పనిలో నిమగ్నమవుతున్నారు. ఒకటి నుంచి ఐదు క్లాస్‌ల దాకా ఒక స్టూడెంట్‌కు రూ.5.45, 6 నుంచి 8 క్లాస్ విద్యార్థులకు రూ.8.17 చొప్పున, తొమ్మిది, పది పిల్లలకు రూ.10.67 చొప్పున ఏజెన్సీలకు గవర్నమెంట్ డబ్బులు చెల్లిస్తుంది. మార్కెట్లో పప్పు, నూనె, కారం, కూరగాయల రేట్లు పెరిగినా ఈ రేట్లలో ఎలాంటి తేడా ఉండదు. అటెండెన్స్ ఆధారంగా స్టూడెంట్స్ ఎంత మంది భోజనం చేసిన వివరాలు ఏరోజుకారోజు హెచ్ఎంల ద్వారా ఎండీఎం యాప్‌లో నమోదై బిల్ రెడీ అవుతుంది. పౌష్టికాహారం కింద వారంలో మూడు రోజులు కోడిగుడ్డు విధిగా పెట్టాలి.
గవర్నమెంట్ ఇందుకు ప్రతి గుడ్డుకు రూ.5 చెల్లిస్తుంది. 1-8 క్లాస్‌ల దాకా విద్యాహక్కు చట్టం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎండీఎం ఖర్చులో 60 శాతం డబ్బును స్టేట్‌కు పంపుతుంది. 9, 10 క్లాస్ స్టూడెంట్స్ ఎండీఎం భారమంతా రాష్ట్రానిదే. సెంట్రల్ గవర్నమెంట్ వాటా సొమ్ము గత బీఆర్ఎస్ పాలకులకు అందినా ఏజెన్సీలకు చెల్లించక తిప్పలు పెట్టారు. ఏడు నెలల బాకీ బిల్ రూ.5 కోట్ల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్‌లో చెల్లించింది.
అయితే గత నవంబర్ నుంచి బకాయి ఉన్న రూ. కోటిన్నర 9, 10 క్లాస్ స్టూడెంట్స్ బిల్లు, గత అక్టోబర్ నుంచి రూ.కోటిన్నర కోడిగుడ్ల పైసలు, జూన్, జులై నెలల వంట మనుషుల గౌరవ వేతనం సొమ్ము కలిపి మొత్తం రూ.5 కోట్ల డబ్బు ఇంకా రావాల్సి ఉంది. ఈ మేరకు డబ్బు చెల్లింపులు ఆగిపోవడం ఏజెన్సీలకు భారంగా మారింది.
ఎండీఎంపై ఎఫెక్ట్
బిల్స్ నిలుపుదల మిడ్డే మీల్స్ క్వాలిటీపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపుతోంది. స్టూడెంట్స్‌కు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం దాదాపు ఆపేశారు. మార్కెట్ గుడ్డు ధర రూ.6 ఉండగా సర్కారు రూ.5 ఇవ్వడం గిట్టుబాటుకావడంలేదని ఏజెన్సీలు అంటున్నాయి. నిత్యావసర సరుకులు మార్కెట్ ప్రైస్ ప్రకారం ఇవ్వాలని కోరుతున్నారు. కాంపౌండ్ వాల్స్ ఉన్న స్కూల్‌గ్రౌండ్‌లో బెండ, దొండ, బీర, సొరకాయ
టమాట, పెంచాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చినా ఆచరణలో పెట్టలేదు. అమ్మబడి పేరుతో సర్కారు బడుల మేనేజ్మెంట్ బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చినందున ఆ దిశగా ఆలోచిస్తే ప్రయోజనం ఉండే చాన్స్ ఉంది.
చాలా కష్టంగా ఉంది
మిడ్డేమీల్స్ ఖర్చు ప్రతినెలా సుమారు రూ.కోటిన్నర ఉంటది. ఒక్కనెలా పేమెంట్ ఆగినా అంత భారం ఏజెన్సీలపై పడుతుంది. వడ్డీలకు డబ్బు తెచ్చి వంటలు చేస్తూ అప్పులపాలవుతున్నం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉద్యోగులకు ఠంచన్‌గా ఒకటో తేది జీతాలు చెల్లిస్తున్నట్లు మాకూ ఇవ్వాలి. ఎండీఎం రేట్లు పెంచకుంటే ఏజెన్సీలు నష్టపోతాయి.
తోపునూరి చక్రపాణి, ఎండీఎం ఏజెన్సీల సంఘం జిల్లా ప్రెసిడెంట్