పరీక్షా కేంద్రాలు దూరం.. పదో తరగతి స్టూడెంట్స్​కు భారం!

  •     5 నుంచి 12 కిలో మీటర్లు ఉన్న సెంటర్లకు వెళ్లాలంటే తప్పని తిప్పలు
  •     చాలా ఊళ్లకు బస్సు సౌకర్యం కరువు.. ప్రవేట్​వెహికల్సే దిక్కు 
  •     సమయం వృథా.. ఆర్థిక ఇబ్బందులని తల్లిదండ్రుల్లో ఆందోళన  
  •     ఏటా ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన 
  •     ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు రాయాలంటే ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విద్యార్థులు పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగ్జామ్ సెంటర్లు కిలోమీటర్ల కొద్దీ దూరం ఉండడంతో దూర భారంతో, ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన చెందుతున్నారు. 5 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలా గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేదు. ప్రైవేట్​ వెహికల్స్​ను ఆశ్రహించాల్సిందే. దీంతో రవాణా చార్జీలతోపాటు సమయం వృథా అవుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  గతంలో ప్రైవేట్​ వాహనాలు ప్రమాదాలకు గురైన ఘటనలూ ఉన్నాయి. ఈసారైనా దూరంగా ఉన్న సెంటర్ల విద్యార్థులకు ప్రయత్నామాయ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. 

ఎక్కడ..? ఏ పరిస్థితి?

  •     మర్కోడ్​ జడ్పీహెచ్​ఎస్​ స్టూడెంట్స్​ దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆళ్లపల్లికి వెళ్లి ఎగ్జామ్​ రాయాల్సి ఉంది. 
  •     అన్నపురెడ్డి పల్లి స్టూడెంట్స్ 10 కిలోమీటర్ల దూరంలోని చండ్రుగొండ మండలంలోని ఎర్రగుంట హైస్కూల్లోని ఎగ్జామ్ సెంటర్​లో  పరీక్ష రాయనున్నారు.
  •     ఇల్లెందు మండలంలోని కొమరారం గవర్నమెంట్​ హైస్కూల్​ స్టూడెంట్స్​ దాదాపు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న రొంపేడు ఆశ్రమ స్కూల్​కు వెళ్లాలి. 
  •     మణుగూరు మండలంలోని సాంబాయిగూడెం, రామానుజవరం ప్రాంతాల్లోని స్టూడెంట్స్​దాదాపు 8 నుంచి 10కిలోమీటర్ల దూరంలోని మణుగూరుకు వెళ్లాల్సిందే. 
  •     కుంటాల హైస్కూల్​ స్టూడెంట్స్​ 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడుకు వెళ్లి ఎగ్జామ్​ రాయాలి. 
  •     పాల్వంచ మండలంలోని పాండురంగాపురం హైస్కూల్​ స్టూడెంట్స్​ 4 కిలో మీటర్ల దూరంలోని బూర్గంపహాడ్​ మండలంలోని ఉప్పుసాక ఎగ్జామ్​ సెంటర్​కు,  నాగారం, జగన్నాధపురం స్టూడెంట్స్​ 4 కిలోమీటర్ల దూరంలోని పాల్వంచకు వెళ్లాల్సి ఉంది. 
  •     టేకులపల్లి మండలంలోని బేతంపూడి హైస్కూల్​ స్టూడెంట్లలో కొందరిని 3 కిలోమీటర్ల దూరంలోని టేకులపల్లి, 5 కిలోమీటర్ల దూరంలోని సులానగర్​లోని ఎగ్జామ్​ సెంటర్లకు అలాట్​ చేశారు. 
  •     పోకలగూడెం, మద్దుకూరు ప్రాంతాలకు చెందిన స్టూడెంట్స్​ 5 కిలోమీటర్ల దూరంలోని చండ్రుగొండ ఎగ్జామ్​ సెంటర్​కు వెళ్లాల్సి ఉంది. 
  •     చెన్నంగుల గడ్డ ఆశ్రమ స్కూల్​ స్టూడెంట్స్​ 3 కిలోమీటర్ల దూరంలోని చల్ల సముద్రం స్కూల్​లోని సెంటర్​కు వెళ్లాలి. 

రోజుకు రూ.250కి పైగా ఖర్చు.. 

ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టూడెంట్స్​ ఎగ్జామ్స్​ కోసం ప్రైవేట్​ వెహికల్స్​లో వెళ్లి వచ్చేందుకు ఒక్కొక్కరు రూ. 250 నుంచి రూ. 350 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మరో వైపు ప్రైవేట్​ వెహికల్స్​లో రాకపోకలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొమరారం నుంచి రొంపేడ్​కు ఎగ్జామ్​ రాసేందుకు వస్తున్న స్టూడెంట్స్​ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన దాఖలాలున్నాయి.

పరీక్షల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న విద్యాశాఖ అధికారులు మాత్రం దూరభారం విషయంలో చేతులెత్తేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతమైన ఈ జిల్లాలో దూరభారం ఉన్న గవర్నమెంట్​ హై స్కూల్​ స్టూడెంట్స్​ను సెంటర్ల వద్దకు తీసుకెళ్లి..  తీసుకువచ్చే విధంగా ఉన్నతాధికారులే వెహికల్స్​ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

 పాతకొత్తగూడెం సెంటర్​ తో పరేషాన్.. 

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని పాతకొత్తగూడెంలో ఎగ్జామ్​ సెంటర్​తో విద్యార్థులు పరేషాన్ అవుతున్నారు. ​ఇక్కడి సెంటర్​ హాల్​ టికెట్లలో ఆనంద్​ ఖని స్కూల్​ పేరుతో ఉండడంతో స్టూడెంట్స్ అయోమయానికి గురవుతున్నారు. గతేడాది ఇదే పరిస్థితి నెలకొంది. అయితే దీనికి కారణం ఐదేండ్ల కింద చుంచుపల్లి మండల పరిధిలోని ఆనంద్​ ఖని స్కూల్​ను పాతకొత్తగూడెం స్కూల్​లో కలిపేశారు. కానీ రికార్డుల్లో మాత్రం ఆనంద్​ఖని స్కూల్​ పేరే ఉంది. దీంతో ప్రతిఏటా సెంటర్​ పాతకొత్తగూడెంలో ఉంటే పేరు మాత్రం అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆనంద్​ ఖని అని ఉంటుంది.

ఈ పరిస్థితితో విద్యార్థులు తొలుత అటు వెళ్లి.. విషయం తెలుసుకొని పాతకొత్తగూడెం వస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై టెన్త్​ ఎగ్జామ్స్​ఇన్​చార్జి మాధవరావును వివరణ కోరగా  పాతకొత్తగూడెంలో ఎగ్జామ్​ రాసే స్టూడెంట్స్​ అందరికీ ఆనంద్​ ఖని స్కూల్​, పాత కొత్తగూడెం స్కూల్​ ఒక్కటే అనే విధంగా అవగాహన కల్పించాలని ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లకు సమాచారం ఇచ్చామని తెలిపారు.