ఖని నుంచి గనికి 15 కి.మీ.. రోడ్డును మూసేయడంతో కార్మికుల అవస్థలు

  • రోడ్డు మూయక ముందు గనికి దూరం 6 కిలోమీటర్లే.. 
  • ఖని– మంథని కొత్త రోడ్డులో బొగ్గు లారీల రాకపోకలతో ప్రమాదాలు 
  • డ్యూటీకి వెళ్లాలంటేనే భయపడుతున్న కార్మికులు 

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని నుంచి సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని జీడీకే 11 ఇంక్లైన్‌‌కు వెళ్లే దగ్గరి దారిని మేనేజ్‌‌మెంట్‌‌ మూసివేయడంతో కార్మికులకు దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పట్టణం నుంచి గని వరకు 6 కిలోమీటర్లు ఉండగా.. ఆ దారిని మూసేయడంతో 15 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిపై టర్నింగ్‌లు ఎక్కువగా ఉండడంతో కార్మికులు ప్రమాదాల బారినపడుతున్నారు.  గోదావరిఖని జీడీకే 11వ గనిలో రోజుకు తొమ్మిది షిప్టులలో 1800 మంది కార్మికులు డ్యూటీ చేస్తుంటారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రీ షిప్టుతో మొదలయ్యే డ్యూటీలు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. గతంలో ఓపెన్‌ ‌కాస్ట్‌‌ 5 ఏర్పాటు కాకముందు గోదావరిఖని ఫైవింక్లయిన్‌‌ చౌరస్తా దాటగానే 5 నిమిషాల్లో కార్మికులు గనికి చేరుకునేవారు. ప్రస్తుతం ఆ రోడ్డును మేనేజ్‌‌మెంట్‌‌ మూసివేయడంతో కొత్త రోడ్డు మీదుగా గనికి చేరుకునేందుకు 40 నిమిషాలకు పైగా పడుతోందని కార్మికులు చెబుతున్నారు. 

టర్నింగ్‌లతో పరేషాన్​

గోదావరిఖని నుంచి మంథని వెళ్ళే మార్గంలో గంగానగర్‌‌, జీడీకే 2వ గని, సుందిల్ల, ముస్త్యాల, గడ్డంపల్లి గ్రామాలతో పాటు సింగిరెడ్డిపల్లి క్రాసింగ్‌ను కలుపుతూ నిర్మించిన కొత్త రోడ్డుపై ఐదు చోట్ల టర్నింగ్‌లున్నాయి. ఈ దారిలో నిత్యం బొగ్గు లారీలు నడుస్తుండడంతో ఉదయం, రాత్రి షిప్టులకు వెళ్లే కార్మికులు జంకుతున్నారు. బొగ్గు లారీల రాకపోకలతో సింగిరెడ్డిపల్లి క్రాసింగ్‌‌ నుంచి జీడీకే 11వ మైన్‌‌ వరకు 2 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా డ్యామేజ్ ​అయింది. దీంతో టూ వీలర్లపై వచ్చే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు కార్మికులు చనిపోయారు. గతంలో గోదావరిఖని నుంచి జీడీకే 11వ గనికి ఓసీపీ 5 మీదుగా ఉన్న పాత దారిని పునరుద్ధరించాలని, కనీసం డ్యూటీలకు  వెళ్లేందుకు కనెక్టింగ్​ రోడ్డు వేయాలని కార్మికులు 
డిమాండ్​ చేస్తున్నారు.