‘ధరణి’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 94 శాతం రైతుల సమస్యలను పరిష్కరించినట్లు ప్రకటించింది. కానీ వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది. ఇప్పటికీ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది రైతులు కోర్టులు, తహసిల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సమస్యలకు పరిష్కారం లభించక మనోవేదనతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ పై సలహాల కోసం ప్రభుత్వం సబ్ కమిటీని వేసింది. ఈ కమిటీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న.
రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 16,130 కేసులను ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. దీంతో ఈ కేసులన్నీ తిరిగి సివిల్ కోర్టులకు వెళ్లాయి. 6,18,360 సాదాబైనామాలు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. పాస్‌బుక్కుల్లో 2,65,653 తప్పిదాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. పాస్‌బుక్కులో చనిపోయిన వారి పేర్లు ఉండడం, ఆధార్ తప్పుగా నమోదుకావడం, ఫొటోలు తప్పుగా పెట్టడం, తండ్రి పేరు, పట్టాదార్ పేరు తప్పుగా రాయడం, భూ విస్తీర్ణం ఎక్కువ, తక్కువ రాయడం, సర్వే నెంబర్ తప్పుగా రాయడం, అసైన్డ్ భూములు మార్పు చేయడం, అటవీ శాఖ వివాదాస్పద భూములు రాయడం, రెండు ఖాతాలు రాయడం మొదలైన తప్పులు ఉన్నట్లు వెల్లడించింది. ఈ పొరపాట్లపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని గమనించి ముఖ్యమంత్రి ఇంత కాలం తర్వాత ధరణి పోర్టల్ పై సలహాలు ఇవ్వడానికి ఉప సంఘాన్ని వేశారు.
ఎన్నో సమస్యలు ఎదురవుతున్నయ్
తహసిల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి సుముఖంగా లేరు. ప్రభుత్వ విధానాలు అమలు జరపటానికి చట్టాలు మార్చాలని వారంతా సలహాలు ఇస్తున్నారు. పాస్బుక్కుల చట్టం 1971 సెక్షన్ 26ను పూర్తిగా రద్దు చేసి సవరణ పెట్టారు. ఆ సవరణ ప్రకారం సాగు కాలం తొలగించడంతో రెవెన్యూ రికార్డుల్లో భూములు అమ్ముకున్నవారే తిరిగి పట్టాదారులయ్యారు. మ్యుటేషన్ జరగకపోవడంతో కొనుగోలు చేసిన వారు హక్కులు కోల్పోయారు. జాగీర్దారుల భూములు ప్రభుత్వాలకే చెందుతాయని సవరణ చట్టం చెప్పింది. వారసత్వ భూములకు చార్జీలు చెల్లించి మ్యుటేషన్ చేయించుకోవాలని చట్ట సవరణ చేశారు. తగాదా భూములను, కోర్టు కేసుల్లో ఉన్న వాటిని పార్ట్ బిలో చేర్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిషేధ పుస్తకం సెక్షన్ 22ఎ పేరుతో పెట్టారు. భూమిలో కొంత భాగం అమ్ముకోగా మిగిలిన భూమిని కూడా నిషేధ పుస్తకంలో పెట్టారు. పట్టా భూములను కూడా నిషేధ పుస్తకంలో చూపించారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలన తగాదా లేని భూములు కూడా నిషేధ పుస్తకంలోకి వెళ్లాయి.
రియల్ ఎస్టేట్ వారికే ప్రయోజనం
రాష్ట్రంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిరంతరం సాగుతుంటాయి. 5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది. వేలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారంతా పాలకవర్గానికి అనుకూలంగా ఉన్నారు. కొనుగోళ్లకు అనుకూలంగా రెవెన్యూ చట్టాన్ని మార్చారే తప్ప భూయజమానుల ప్రయోజనాలను కాపాడటానికి చట్టాల సవరణ జరగలేదు. ఒకేఒక్క చట్ట సవరణ(1971 పాస్ పుస్తకాల చట్టం, సెక్షన్ 26)ను మాత్రమే చేశారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన అర్హులు 2017 వరకు పట్టాలు మార్పిడి చేయించుకోవచ్చని ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. కానీ రాష్ట్రంలో ఈ రోజుకు 2.80 లక్షల ఎకరాల అసైన్ భూమిని 82 వేల మంది కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. కానీ కొనుగోలు చేసిన వారిలో అర్హులను గుర్తించి వారికి పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? అక్రమంగా కొనుగోలు చేసిన వారిని రక్షించడానికే ఈ జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది.
తగాదాలకు పరిష్కారం చూపిస్తలేదు
అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య గల తగాదాలను ప్రభుత్వం పరిష్కరించ దలుచుకోలేదు. లక్షలాది ఎకరాల భూములు రెండు శాఖల మధ్య తగాదాల్లో ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 1963 డిసెంబర్ 1కి ముందు కొనుగోలు చేసిన గిరిజనేతరులకు భూమిపై హక్కు ఉంటుంది. కానీ ఈ చట్టాన్ని కూడా అమలు చేయడంలేదు. 1967 అటవీ చట్టం ప్రకారం రెవెన్యూ భూమిని అటవీ భూమిగా మార్చాలంటే ఈ చట్టంలోని సెక్షన్ 4 నుంచి సెక్షన్ 15 వరకు అమలుచేయాలి. అవేవి లేకుండానే అటవీ అధికారులు రైతులపై దాడులు చేస్తున్నారు. ఇది ధరణి చట్టానికి అనుకూలం కాదు. అలాగే ఒకరి సర్వే నెంబర్లోని భూమి మరొకరి సర్వే నెంబర్లో ఉంటే దానిని బయటకు తీయడానికి సర్వే తప్ప మరో మార్గం లేదు. కొన్ని సర్వే నెంబర్లలో ఉండవలసిన భూమికన్నా ఎక్కువ లేదా తక్కువ ఉంటోంది. వీటి సవరణకు ఏ చట్టం చేయలేదు. వారసత్వ భూములకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య ‘‘పరిష్కార పత్రం’’ ద్వారా పట్టా మార్పిడి జరగాలి. కానీ దీనికి కూడా మ్యుటేషన్ చార్జీలు నిర్ణయించడం దుర్మార్గం. మరణించిన వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి, వారసుల పేర్లను నమోదు చేయలేదు.
ప్రభుత్వ భూ సేకరణకే అనుకూలం
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చుతామని, రైతుల ప్రయోజనాలు, వారి హక్కులు కాపాడుతామని చేసిన వాగ్దానం అమలు కాలేదు. ప్రభుత్వ భూ సేకరణ కోసం ధరణి ద్వారా భూములు సేకరించడానికి మార్గం సుగమం చేసుకుంది. అలాగే ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు భూములు కొనుగోలు చేయడానికి ఈ చట్ట సవరణ తోడ్పడుతున్నది. కానీ, సాగు చేసుకుంటున్న భూ యజమానులకు మాత్రం ఈ చట్టం పనికి రావడం లేదు. అవినీతి అధికారులు పట్టాదారులను, సాగుదారులను అనేక ఇబ్బందులపాలు చేస్తున్నారు. వేల కేసులు సివిల్ కోర్టుల నుంచి హైకోర్టుల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. భూమితో సమానమైన విలువ, వ్యయం చేసిన భూముల తగాదాలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, భూదాన భూముల అక్రమణలు పెద్ద ఎత్తున సాగాయి. ధరణిలో ఈ దురాక్రమణలకు సంబంధించి ఎలాంటి చట్ట సవరణ లేదు.
డిజిటల్ సర్వే చేయలే
రాష్ట్రంలో భూముల సర్వే చేయిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించి 7 సంవత్సరాలు గడిచింది. డిజిటల్ సర్వే చేస్తామని కూడా చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రకటించారు. సర్వే చేయడానికి ముందు చట్టాలు మార్చాలి. ఇంత వరకు దానికి సంబంధించిన బిల్లు తయారు కాలేదు. సాదాబైనామాలు రెగ్యులరైజ్ చేసి సర్వే చేపట్టాలి. రెగ్యులరైజ్ చేయాలంటే గుర్తింపు కార్డు, బ్యాంక్అకౌంట్, భూమి వివరాలు, సాదాబైనామా వివరాలు, ఆధార్ కార్డు, భూమి అమ్మిన, కొనుగోలు చేసిన వారి పాస్‌బుక్కులు, మీసేవ ఎక్నాలెడ్జ్మెంట్ ఉండాలి. కానీ ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు అనేక ఇబ్బందులు కల్పిస్తూ రిజిస్టర్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు, కలెక్టర్ స్థాయి వరకు తమ బాధ్యత లేదంటూ తప్పుకుంటున్నారు. సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి వెళ్లిన దారిలోనే నడుస్తున్న ఎక్కువ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఫాంహౌస్ నిర్మాణాలపై దృష్టి పెట్టి భూములు ఒకే చోట సంపాదిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కూడా ఉంటున్నాయి. సర్వే చేస్తే పెద్దలు బలవంతంగా ఆక్రమించిన భూములన్నీ బయటపడతాయి. అందువల్ల సర్వే చేయడం జరగని పని. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒకే రోజు సమగ్ర సర్వే చేసి రికార్డులు తయారుచేసింది. కానీ డిజిటల్ సర్వే చేయడానికి మాత్రం కాలయాపన చేస్తున్నది.
చట్టాలను సవరించాలె
ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రామ సర్వే చేసి రికార్డులను అప్ డేట్ చేయాలి. కానీ, ధరణిలో సెక్షన్ 26 సవరణతో ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తప్పుకుని భూయజమానిపైనే పెట్టాయి. భూయజమాని నిర్దిష్ట చార్జీలు చెల్లించి రికార్డులను మార్చుకోవాలి. ప్రస్తుతం సర్వే శాఖలో కొలతల కోసం అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ధరణి అనేది రిజిస్ట్రేషన్ చార్జీల ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం తప్ప.. సమస్యల పరిష్కారానికి కాదన్నది ఆచరణలో రుజువైంది. భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం సహజంగానే పెరిగింది. ప్రభుత్వం వేసిన కమిటీ ఈ సమస్యలన్నింటిని చర్చించి పరిష్కారం చూపాలి. అందుకు అవసరమైన రెవెన్యూ చట్టాలను సవరించాలి. కాలయాపన చేయకుండా రెవెన్యూ భూముల సమస్యలను కనీస సమయంలో పరిష్కరించాలి. భూ యాజమానులలో ఉన్న ఆందోళనలను తొలగించాలి. రెవెన్యూ రికార్డుల్లో సాగుదారు కాలం పెట్టాలి. దీని వల్ల కౌలుదారులకు రక్షణ కలుగుతుంది. భూ యజమాని భూమి అమ్ముకోవడంలో కానీ, అభివృద్ధి చేసుకోవడంలో కానీ గత కాలంలో ఎలాంటి ఆటంకాలు రాలేదు. అందువల్ల ధరణి అమలులో వస్తున్న ఇబ్బందులను తొలగించే విధంగా కమిటీ సహాయపడుతుందని ఆశిద్దాం. -సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్ సభ.