హైదరాబాద్, వెలుగు: డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ సర్వీస్‌లు (డీఈటీ) అందిస్తున్న సైయంట్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ. 1,476 కోట్ల రెవెన్యూ సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 22 శాతం గ్రోత్‌కు సమానం. అదే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రెవెన్యూతో పోలిస్తే 1.5 శాతం ఎక్కువ. కంపెనీ నికర లాభం ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 71 శాతం పెరిగి రూ.172.8 కోట్లకు ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్‌లో పాజిటివ్ గ్రోత్ నమోదు చేశామని సైయంట్ ఎండీ బోదనపు కృష్ణ అన్నారు. గ్రూప్ రెవెన్యూ 214.9 మిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు.
ఇందులో డీఈటీ బిజినెస్ రెవెన్యూ 178.4 మిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు. డీఈటీ సెగ్మెంట్‌లో ఐదు పెద్ద డీల్స్ గెలుచుకున్నామని, వీటి కాంట్రాక్ట్ విలువ 51.4 మిలియన్ డాలర్లు అని కృష్ణ పేర్కొన్నారు. నిలకడైన కరెన్సీ దగ్గర డీఈటీ సెగ్మెంట్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 15–20 శాతం వృద్ధి చెందుతుందని అంచనావేశామన్నారు. సైయంట్ డీఈటీ బిజినెస్ నికర లాభం భారీగా పెరిగిందని కంపెనీ సీఈఓ కార్తిక్ నటరాజన్ అన్నారు. కస్టమర్లకు సాయం చేసేందుకు రోబోటిక్స్, ఏఐ, క్లౌడ్, డేటా వంటి టెక్నాలజీలను వాడతామని చెప్పారు. చాలా ఇండస్ట్రీలలో ఆటోమేషన్ పెరగడం చూస్తున్నామని అన్నారు. సైయంట్ లిమిటెడ్ షేరు గురువారం సెషన్‌లో 4 శాతం పెరిగి రూ. 1,750 దగ్గర క్లోజయ్యింది