- పేజీలు స్కాన్ చేస్తే పైసలంటూ రూ.30 కోట్లకు మోసం
- బోర్డ్ తిప్పేసిన ‘డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’
- 700 మంది బాధితులు.. సెక్యూరిటీ డిపాజిట్ కింద లక్షల్లో చెల్లింపు
హైదరాబాద్, వెలుగు: వర్క్‌ఫ్రమ్ పేరుతో మోసాలు చేస్తున్న ఫేక్ కంపెనీ గుట్టురట్టయింది. పేపర్ డిజిటలైజేషన్ చేయాలంటూ రూ.30 కోట్లు వసూలు చేసిన ‘డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ బోర్డ్ తిప్పేసింది. మోసపోయామని గుర్తించిన బాధితులు బుధవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం... నార్త్ ఇండియాకు చెందిన అమిత్ శర్మ ‘‘డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్” అనే కంపెనీని ప్రారంభించాడు. అమీర్‌పేట్, బంజారాహిల్స్‌లో బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగంగా హార్డ్ కాపీ మెటీరియల్‌ను సాఫ్ట్‌వేర్ కాపీస్‌గా మార్చాలని, ఇంటి వద్ద నుంచే పనిచేయొచ్చని పలువురిని నమ్మించాడు. 11 నెలల పీరియడ్‌తో అగ్రిమెంట్ తీసుకున్నాడు. అంగీకరించిన వారికి ప్రాజెక్ట్ పేపర్స్, స్కానర్స్ ఇచ్చాడు. ప్రతి డిజిటల్ పేపర్‌కు రూ.5 చొప్పున10 వేల పేజీలకు రూ.50 వేలు, 30 వేల పేజీలకు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పాడు. ఇందుకోసం పేజీలను బట్టి రూ.లక్ష నుంచి రూ.19.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో స్లాబ్స్ ప్రిపేర్ చేశాడు. డిపాజిట్‌అమౌంట్ ఆరు నెలల తర్వాత రీఫండ్ చేస్తామని నమ్మించాడు.
ప్రాజెక్ట్ 2.0తో డబుల్ చీటింగ్
వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో చేరిన మెంబర్స్‌కి డబ్బులు చెల్లించి నమ్మించాడు. మెంబర్స్ పెరగడంతో 2.0 పేరుతో కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. ఇందులో తక్కువ వర్క్ ఇచ్చి ఎక్కువ అమౌంట్‌ను సెక్యూరిటీ డిపాజిట్ కింద కలెక్ట్ చేశాడు. 30 వేల పేజీలకు 25 రోజుల టైమ్ పెట్టి, రూ.3.5 లక్షలు డిపాజిట్ కింద వసూలు చేశాడు. వర్క్ పూర్తి చేసిన వారికి రూ.2 లక్షలు చెల్లించాడు. తర్వాత లక్ష పేజీల వర్క్ వరకు స్లాబ్ ప్రిపేర్ చేశాడు. ఒక్కో స్లాబ్‌లో రూ.2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ పెంచుతూ వచ్చాడు. ఈ క్రమంలో లక్ష పేజీల వర్క్ తీసుకున్న వారు రూ.19.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి వచ్చింది. వర్క్ పూర్తి చేసిన తర్వాత రూ.10 లక్షలు చెల్లించేలా ప్లాన్ చేసి డబ్బుతో ఉడాయించాడు.
680 మంది బాధితులు
కంపెనీలో మెంబర్స్‌గా చేరిన వారి నుంచి చైన్ సిస్టమ్‌లో కొత్త సభ్యులను చేర్పించేలా ప్లాన్ చేశాడు. ఇందులోని కొంత మందిని సంస్థ ఉద్యోగులు, టీమ్ లీడర్స్‌గా నియమించాడు. ఇలా డిసెంబర్ నుంచి గత నెల వరకు సుమారు 680 మందిని డిజినల్ ఇండియా వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో జాయిన్ చేయించాడు. మే, జూన్ నెలల్లోనే రూ.26 కోట్లకు పైగా వసూలు చేశాడు. వర్క్ పూర్తి చేసిన వారికి జులై 1న పేమెంట్స్ చేయాల్సి ఉండగా చెల్లించలేదు. ఫోన్ కాల్స్‌కు స్పందన రాలేదు. అనుమానం వచ్చిన బాధితులు మంగళవారం ఆఫీస్‌కెళ్లి చూశారు. తాళాలు వేసి ఉండటంతో, బోర్డ్ తిప్పేసి ఎస్కేప్ అయినట్లు గుర్తించారు. 50 మంది మెంబర్స్ బుధవారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.