- చక్రం తిప్పుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
- రహస్యంగా భూముల బదలాయింపు
- బాధితుల కంప్లైంట్ తో వెలుగులోకి
గద్వాల, వెలుగు : కలెక్టరేట్, తహసీల్దార్ ఆఫీసుల్లో డిజిటల్ కీతో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. అథెంటిక్ గా ఉండాల్సిన డిజిటల్ కీ మిస్ యూస్ అవుతోంది. దీంతో భూముల రికార్డులు తారుమారు అవుతున్నాయి. ఇటీవల ఏకంగా కలెక్టరేట్ లోనే డిజిటల్ కీ మిస్ యూస్ అవడం సంచలనం సృష్టించింది. డిజిటల్ కీలన్ని అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేతుల్లో ఉండడంతో అక్రమార్కులు వారితో కుమ్మక్కై కోట్ల ప్రాపర్టీని కొట్టేస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్ లోని ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరికీ తెలియకుండా, ఎలాంటి దరఖాస్తూ రానప్పటికీ గద్వాల శివారులోని 868/బి లోని 4 ఎకరాల భూమిని గొబ్బూరి శారద పైకి మార్చేశారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఎంక్వయిరీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
ఇలా వెలుగులోకి..
గొబ్బూరి శారద తన పేరు మీద ఉన్న 868/బి లో ఉన్న 4 ఎకరాల భూమిని గతంలోనే ఇతరులకు అమ్మారు. అందులో వెంచర్ కూడా వేశారు. అవెంచర్ లో దాదాపు 280 ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేశారు. వెంచర్ వేసేటప్పుడు ల్యాండ్ కన్వెన్షన్ కాకపోవడంతో ఆ భూమి ధరణిలో మళ్లీ పాత ఓనర్ గొబ్బూరి శారద పేరుతో వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు ఎకరాకు రూ. రెండు కోట్లు ధర పలుకుతుండడంతో దానిని ఎలాగైనా కొట్టేయాలని స్కెచ్ వేశారు. అందులో భాగంగా పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కొత్త ఓనర్లు కంప్లైంట్ చేయడంతో డీఎస్( డిజిటల్ సిగ్నేచర్) పెండింగ్ లో పెట్టారు. ఆపరేటర్లతో కుమ్మక్కై డిజిటల్ కీ ద్వారా పాస్ పుస్తకాలు వచ్చేలా డిజిటల్ సిగ్నేచర్ చేసేసి వారికి అనుకూలంగా మార్చేసుకున్నారు.
బాధితుల ఫిర్యాదుతో ..
తాము కొన్న ఫ్లాట్లు తమకు కాకుండా పోతాయని 280 మందితో పాటు, గద్వాలకు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ( ప్రస్తుతం బిహార్ క్యాడర్ లో పనిచేస్తున్నాడు) గద్వాల కలెక్టర్ కు కంప్లైంట్ చేయడంతో కలెక్టర్ ఎంక్వైరీ చేశారు. తహసీల్దార్ ఆఫీస్ నుంచి కానీ, ఆర్డీవో ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి ఫైల్ రాకుండానే డిజిటల్ సిగ్నేచర్ చేసేసినట్లు గుర్తించి వెంటనే ఆ సర్వే నంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టారు. కారణమైన ఎంప్లాయి పై కలెక్టరేట్ ఏవో టౌన్ పీఎస్ లో గత నెల 25వ తేదీన కంప్లైంట్ చేశారు. కానీ ఈ విషయాన్ని అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, ఆఫీసర్లు సీక్రెట్ గా పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.
లిటిగేషన్, ప్రభుత్వ భూములే టార్గెట్
లిటిగేషన్, ప్రభుత్వ భూమిని టార్గెట్ గా డిజిటల్ కీని మిస్ యూస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. గద్వాల టౌన్ పరిధిలోని సర్వే నంబర్ 383లో 10 గుంటల ప్రభుత్వ భూమిని కూడా ఆపరేటర్లతో కు మ్మక్కై ప్రభుత్వ భూమిగా తొలగించి టీఆర్ఎస్ లీడ ర్ల కు రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే 382 సర్వే నంబర్లు సిద్ధాంతవారికుంటలో ఉన్న 9 ఎకరాల 20 గుంటల భూమిని కూడా కొట్టేసే ప్లాన్ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కీలకమైన డిజిటల్ కీ ఎంప్లాయీస్ కు కా కుండా ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఇవ్వడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక తప్పిదంతో ఎన్నో సర్వేనెంబర్లను తారుమారు చేసేసి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎఫ్ఐఆర్ చేశాం
డిజిటల్ కీ మిస్ యూస్ వ్యవహారంపై కలెక్టరేట్ ఏఓ కంప్లైంట్ పై గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశాం. ఈ కేసులో ఎంక్వయిరీ నడుస్తున్నది. - చంద్రశేఖర్, సీఐ, గద్వాల కోర్టులో ఉన్నా పట్టించుకోలే 868/బి సర్వే నెంబర్ వ్యవహారం కోర్టులో ఉన్నా పట్టించుకోకుండా కలెక్టరేట్ ఆఫీస్ లోని ఒక ఎంప్లాయ్, ఆర్డీఓ ఆఫీస్ లోని మరో ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని 50 లక్షలకు డీలు కుదుర్చు కొని డిజిటల్ కీ మార్పేశారు. కలెక్టర్ ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉన్నది.- ఖలీల్ బాధితుడు