ఇక గెట్టు పంచాయితీలకు ఫుల్ స్టాప్.. తెలంగాణ వ్యాప్తంగా భూముల సర్వే.!

ఇక గెట్టు పంచాయితీలకు ఫుల్ స్టాప్.. తెలంగాణ వ్యాప్తంగా భూముల సర్వే.!
  • గెట్టు పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ నిర్ణయం 
  • 6 నెలల టైమ్, రూ.600 కోట్లు ఖర్చవుతుందని అంచనా 
  • సర్వే కోసం పరికరాల కొనుగోలుకు త్వరలో టెండర్లు 
  • ఖాళీగా ఉన్న సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీ 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్  ​ద్వారా ప్రస్తుతం హద్దులు, మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌లు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో ఊరూరా గెట్టు పంచాయతీలు పెరుగుతున్నాయి. త్వరలో అమల్లోకి రానున్న భూభారతి చట్టంతో ఈ సమస్యకు చెక్​పెట్టాలని సర్కార్ భావిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటినీ సర్వే చేసి, ప్రతి సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌లో బై నెంబర్ల వారీగా  మ్యాప్‌‌‌‌లు రెడీ చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి భూభారతి చట్టం ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో సర్వే మ్యాప్‌‌‌‌ తప్పనిసరి. 

ఈ మేరకు గైడ్‌‌‌‌లైన్స్ రూపొందిస్తున్న సర్కార్.. తాజాగా సర్వే మ్యాప్‌‌‌‌లపై దృష్టిసారించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా భూములను సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి మండలానికి ఒక డిజిటల్ సర్వే పరికరం చొప్పున కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు  ప్రతి మండలానికి ఒక సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్​ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలో 570  మండలాలు ఉండగా, అందులో సగం మండలాల్లోనే సర్వేయర్లు ఉన్నారు. మిగతా మండలాల్లో వారే ఇన్‌‌‌‌చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య పెరిగినా.. ఆ మేరకు శాంక్షన్డ్ పోస్టులు పెరగలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాత వీఆర్‌‌‌‌‌‌‌‌వోలను తిరిగి రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోకి తీసుకుని.. వారికి ట్రైనింగ్​ఇచ్చి సర్వేయర్​పోస్టులను భర్తీ చేయాలని  ప్రభుత్వం భావిస్తున్నది. ఇలా ప్రతి మండలానికి ఒక డిప్యూటీ సర్వేయర్, ఒక సర్వేయర్​ఉండేలా ప్లాన్​చేస్తున్నది. ఈ వారం, పది రోజుల్లో భూభారతి రూల్స్​ఫైనల్​చేసి చట్టం అమల్లోకి తెచ్చినా సర్వే మ్యాప్‌‌‌‌కు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నది. 

డీజీపీఎస్ పద్ధతిలో సర్వే!  

రాష్ట్రంలో దాదాపు లక్ష కిలోమీటర్ల భూవిస్తీర్ణం ఉంది. నీటి వనరులు, అడవులు తీసివేస్తే.. వ్యవసాయ, ఇతర భూముల సర్వే చేపట్టాల్సి ఉంటుంది. తక్కువలో తక్కువగా సర్వేకు కనీసం 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. భూసర్వే కోసం డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం- (డీజీపీఎస్), డిజిటల్ పట్టాలతో లైడార్ సర్వే, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే తదితర పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. భూయజమాని సమక్షంలోనే డీజీపీఎస్ సర్వే చేస్తే... ప్రజల మద్దతు కూడా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతిలోనే వీలైనంత త్వరగా పూర్తి చేసే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు. సాంకేతిక యంత్రాలు, మానవ వనరులు, తదితర ఖర్చులు కలుపుకుని రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భూముల సర్వే పెద్ద సమస్య కాదని.. ఆ తర్వాత సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ అవసరమని, భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్‌‌‌‌ పార్సిల్‌‌‌‌ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు. సర్వేలో భాగంగా ముందు ప్రభుత్వ, ఎండోమెంట్​భూములను సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని.. ఆ తర్వాత రైతుల భూములను కంప్లీట్​ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

అప్పటికి ఇప్పటికి మొత్తం మారిపోయింది.. 

భూవివాదాలు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా భూభారతి చట్టం, భూపరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వం.. భూముల సరిహద్దుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటున్నది. 89 ఏండ్ల కింద నిజాం పాలనలో 1936 సంవత్సరంలో చేసిన భూసర్వేనే ఇప్పటికీ ప్రామాణికంగా ఉన్నది. ఆనాటి వివరాల ఆధారంగానే దస్త్రాలు కొనసాగుతున్నాయి. కాలంతో పాటు భూయజమానులు కూడా మారుతూ రాగా... భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి. నాటి సర్వే దస్త్రాల్లో ఫలానా కొండ పక్కన అని మొదలు పెట్టి హద్దును సూచించేవారు. చాలా ప్రాంతాల్లో కొండలు కరిగిపోవటం, క్రయవిక్రయాలు, పంపకాలతో భూమి చాలా మంది చేతులు మారింది. భూసర్వే నంబర్ల పక్కన బైనంబర్లు పెరిగిపోయాయి. దస్త్రాల్లో నమోదైన విస్తీర్ణం కూడా క్షేత్రస్థాయి కన్నా పెరిగింది. భూవివాదాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. దీంతో పట్టా పాసు పుస్తకాల్లో భూమి ఒకరి పేరు మీద ఉంటే, ఫీల్డ్‌‌‌‌లో మరొకరు సాగులో ఉంటున్నారు. సరిహద్దు వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి. అందులో భాగంగానే భూభారతి చట్టంలో ఏ సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌లోని భూమిని విక్రయిస్తున్నారో.. దానికి సంబంధించిన మ్యాప్‌‌‌‌ను పూర్తి స్థాయిలో సమర్పించేలా నిబంధన తెచ్చారు. ఎవరికి వాళ్లకు అవకాశం ఇస్తే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వమే సర్వే చేసి మ్యాప్‌‌‌‌లను ఇచ్చి డిజిటల్​కోఆర్డినేట్స్​ఫిక్స్ చేస్తే భవిష్యత్తులో ఎప్పటికీ ఇబ్బంది రాదని భావిస్తున్నారు. 

2018లో అనుకున్నప్పటికీ చేయలేదు.. 

 రాష్ట్రంలో పూర్తిస్థాయి భూసర్వే నిర్వహించాలని 2018లో నాటి సీఎం కేసీఆర్​భావించారు. ప్రాథమికంగా కసరత్తు కూడా మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టేందుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ, చింతపల్లిగూడ, సిద్దిపేట జిల్లా జగదేవ్‌‌‌‌పూర్ మండలం దౌలాపూర్‌‌‌‌ను ఎంచుకున్నారు. సర్వే ఆఫ్‌‌‌‌ ఇండియా సంస్థకు చెందిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఉపయోగించి ఈ గ్రామాల్లో నిర్దేశిత కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సర్వే చేపట్టారు. ఈ సర్వే నివేదిక ద్వారా రైతుబంధు సాయం అందించాలకున్నారు. కానీ తక్కువ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గారు.