పట్టణాల్లో డిజిటల్‌‌‌‌ ‘నక్ష’..చిన్న పట్టణాల అభివృద్ధికి కేంద్రం చర్యలు

పట్టణాల్లో డిజిటల్‌‌‌‌ ‘నక్ష’..చిన్న పట్టణాల అభివృద్ధికి కేంద్రం చర్యలు
  • రూ.193.81 కోట్లతో డిజిటల్‌‌‌‌ సర్వేకు శ్రీకారం
  • రాష్ట్రంలోని 142 పట్టణాల్లో డిజిటల్‍ సర్వే చేపట్టాలని నిర్ణయం
  • మొదటి దశలో 10 మున్సిపాలిటీలు ఎంపిక
  • ప్రభుత్వ ఆఫీసులు, నాలాలు, డంపింగ్‍ యార్డుల విస్తీర్ణం సేకరణ
  • నేటి నుంచి వరంగల్‌‌‌‌ జిల్లా వర్ధన్నపేటలో.. ఆపై యాదగిరిగుట్టలో సర్వే

వరంగల్‍/కాజీపేట, వెలుగు : రాష్ట్రంలో చిన్న పట్టణాల అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాటే లక్ష్యంగా కేంద్రం నేషనల్‌‌‌‌ జియో స్పాటియల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ సర్వే ఆఫ్‌‌‌‌ అర్బన్‌‌‌‌ హ్యాబిటేషన్‌‌‌‌ (నక్షా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మినిస్ట్రీ ఆఫ్‌‌‌‌ రూరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ రిసోర్సెస్‌‌‌‌ ఆధ్వర్యంలో రూ.193.81 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను రూపొందించింది. 

ఈ సర్వేలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆఫీసర్లు, స్థానిక జిల్లా కమిటీ ఆఫీసర్లతో కలిసి హెలికాప్టర్‌‌‌‌, హైటెక్నాలజీ కలిగిన కెమెరాలతో ఏరియల్‍ భూ సర్వే చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆదివారం సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌‌‌‌ పట్టణంలో సర్వే చేయగా, మంగళవారం నుంచి వరంగల్‍ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట, ఉమ్మడి నల్గొండలోని యాదగిరిగుట్ట పట్టణాల్లో డిజిటల్‌‌‌‌ సర్వేకు రెడీ అయ్యారు.

దేశంలో 100 పట్టణాలు..రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు

డిజిటల్‌‌‌‌ ఇండియా ల్యాండ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ మోడ్రనైజేషన్‌‌‌‌ ప్రోగ్రాం (డీఐఎల్‍ఆర్‍ఎంపీ)లో భాగంగా ‘నక్ష’ ప్రాజెక్ట్‌‌‌‌ చేపట్టగా, రాష్ట్రంలోని 142 పట్టణాల్లో ఈ తరహా సర్వే చేయాలని ప్లాన్‌‌‌‌ చేశారు. అయితే మొదటి దశలో దేశవ్యాప్తంగా 100 పట్టణాలను ఎంపిక చేయగా, రాష్ట్రం నుంచి పది పట్టణాలను సెలెక్ట్‌‌‌‌ చేశారు. ఇందులో ఆర్‌‌‌‌వీ (ఏఏఆర్‍వీఈఈ) అసోసియేట్స్‌‌‌‌ అనే ప్రైవేట్‍ సంస్థ కొడంగల్‍, జడ్చర్ల, మిర్యాలగూడ, జగిత్యాల, హుస్నాబాద్‍, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట పట్టణాల పరిధిలో డిజిటల్‍ సర్వే చేపట్టనుండగా, ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ సంస్థ మహబూబాబాద్‍, మణుగూరు, వేములవాడలో సర్వే చేయనుంది.

సాగు భూముల నక్ష లెక్కనే ‘పట్టణ నక్ష’

సాగుభూములకు నక్ష ఎలా అయితే ఉంటుందో.. అంతే క్లియర్‌‌‌‌గా పట్టణాలకు సంబంధించిన వివరాలన్నీ తెలిసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ ‘నక్ష’ ప్రోగ్రామ్‌‌‌‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగా సర్వే బృందం ఆయా పట్టణాల పరిధిలో ఉండే ప్రభుత్వ స్థలాల గుర్తింపు, నివాసాల సంఖ్య, మురికివాడలు, చెరువులు, కాల్వలతో పాటు నాలాలు, డంపింగ్‌‌‌‌ యార్డుల విస్తీర్ణం, హద్దులు, ఆక్రమణలను గుర్తించనున్నారు. సర్వే బృందం హెలికాప్టర్‌‌‌‌ ద్వారా డ్రోన్‌‌‌‌ కెమెరాలైన ఆర్థోరెక్టిఫైడ్‍ ఇమెజ్రీ (ఓఆర్‍ఐ), డిజిటల్‍ ఎలివేషన్‌‌‌‌ మోడల్‍ (డీఈఎం) 2డీ, 3డీ, 4డీ నడీర్‍ ప్లస్‍ కెమెరాలతో పాటు మరో ఐదు ఒబ్లిక్‌‌‌‌ యాంగిల్‌‌‌‌ సెన్సార్‍ కెమెరాలను వినియోగిస్తున్నారు. 

వీటిద్వారా ఫిజికల్‍ ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నారు. అక్షాంశాలు, రేఖాంశాల రూపంలో రికార్డులు గీసి వివరాలను డిజిటలైజేషన్‌‌‌‌ చేయనున్నారు. జిల్లాలకు సంబంధించిన సర్వే కమిటీ బృందంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‍ చైర్మన్‍గా వ్యవహరిస్తుండగా, మున్సిపాలిటీ కమిషనర్‍తో పాటు ఇతర శాఖల అధికారులు ఉండనున్నారు. 

మొదట హుస్నాబాద్‍, వర్ధన్నపేట, ఆపై యాదగిరిగుట్టలో..

రెండు సంస్థలు రాష్ట్రంలోని 10 పట్టణాల్లో సర్వే చేపడుతుండగా ఆర్వీ సంస్థ తన పరిధిలో ఉన్న పట్టణాల్లో మొదటి దశ డిజిటల్‍ సర్వే మొదలుపెట్టింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 28 వేల చదరపు కిలోమీటర్లు, వరంగల్‌‌‌‌ జిల్లా వర్ధన్నపేటలో 41,430, వికారాబాద్‌‌‌‌ జిల్లా కొడంగల్‌‌‌‌లో 36,020, జగిత్యాల జిల్లాలో 29,550, మహబూబ్‍నగర్‌‌‌‌ జిల్లా జడ్చర్లలో 35,240, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌లో 25 వేల చదరపు కిలోమీటర్లతో పాటు యాదగిరిగుట్ట పట్టణంలో సర్వేకు సిద్ధమయ్యారు. ఎల్‍ అండ్‌‌‌‌టీ సంస్థ భద్రాద్రి జిల్లా మణుగూరులో 24,860, మహబూబాబాద్‍ జిల్లా మహబూబాబాద్‍ పట్టణంలో 45 వేల చదరపు కిలోమీటర్లతో పాటు వేములవాడ మున్సిపాలిటీలోనూ సర్వే చేపట్టనున్నట్లు జాబితాలో పొందుపరిచారు. 

ఈ క్రమంలో ఆఫీసర్ల బృందం ఆదివారం ఉమ్మడి కరీంనగర్‍ జిల్లాలోని హుస్నాబాద్‌‌‌‌లో సర్వే చేపట్టగా.. సోమవారం ఆఫీసర్లు, సంస్థ ప్రతినిధులు.. వరంగల్‌‌‌‌ జిల్లా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మంగళ, బుధవారాల్లో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో.. ఆపై యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో డిజిటల్‍ సర్వే చేపట్టేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో రోజు ఆరు గంటల చొప్పున సర్వే చేయనున్నట్లు తెలిపారు.