
- గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం మనీ ట్రాన్స్ ఫర్లకు బ్రేక్
- సమస్యను సరిచేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సేవల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7గంటల వరకు అంతరాయం ఏర్పడింది. దాంతో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రముఖ డిజిటల్ చెల్లింపు యాప్‌లలో పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ సమస్యలు ఎదుర్కొన్నట్లు యూజర్లు తెలిపారు. ఈ సమస్యపై సోషల్ మీడియా వేదికలు ఫిర్యాదులు, మీమ్స్‌తో నిండిపోయాయి. యూపీఐ సర్వీస్ అంతరాయానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా మొత్తం 2,750 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 296 ఫిర్యాదులు గూగుల్ పే వినియోగదారుల నుంచి కాగా..మరో 119 ఫిర్యాదులు పేటీఎం యాప్‌కు సంబంధించినవి.
ఈ అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) స్పందించింది. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయాన్ని కన్ఫామ్ చేసింది. టెక్నికల్ ఇష్యూలతో యూపీఐ సేవలపై తాత్కాలికంగా ప్రభావం పడినట్లు తెలిపింది. ప్రస్తుతం సమస్య పరిష్కారమైందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా పేర్కొంది. కాగా.. యూపీఐ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల చిన్న అంతరాయమే ఎక్కువ ప్రభావితం చూపిందన్నారు.