- త్వరలో డిజిటల్ రూపాయి లాంచ్...
- దశల వారీగా అమల్లోకి
- ప్రజల్లో అవగాహన పెంచేందుకు కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసిన ఆర్‌బీఐ
బిజినెస్ డెస్క్, వెలుగు: పైలెట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ రూపాయిని త్వరలో లాంచ్ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. అంతేకాకుండా డిజిటల్ రూపాయిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఒక కాన్సెప్ట్ నోట్‌ను కూడా విడుదల చేసింది. డిజిటల్ రూపాయి అంటే ఏంటి? డిజిటల్ కరెన్సీకి, ఆర్‌బీఐ ఇష్యూ చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ లేదా డిజిటల్ రూపాయి) కి మధ్య తేడా ఏంటి? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లాంచ్ కానున్న డిజిటల్ రూపాయి మొదట కొన్ని నిర్ధిష్టమైన సందర్భాల్లో వాడే విధంగా తీసుకొస్తారు. వీటి వాడకాన్ని మొదటిలో కొన్ని ట్రాన్సాక్షన్లు లేదా కొన్ని విభాగాలకే రిస్ట్రిక్ట్ చేస్తారు. దశల వారీగా లాంచ్ చేశాక ఫైనల్ లాంచ్ ఉంటుందని ఆర్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఆర్‌బీఐ విడుదల చేసిన కాన్సెప్ట్ నోట్ ప్రకారం డిజిటల్ రూపాయి అంటే ఏంటో తెలుసుకుందాం!
డిజిటల్ రూపాయి..
ఆర్‌బీఐ ఇష్యూ చేసే కరెన్సీ నోట్లు, కాయిన్లకు ఉన్న అన్ని రకాల హక్కులు సీబీడీసీ లేదా డిజిటల్ రూపాయికి ఉంటాయి. అంటే డిజిటల్ రూపాయికి కూడా దేశంలో లీగల్ టెండర్ హోదా ఉంటుంది. ప్రస్తుతం కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకుంటున్న మాదిరే డిజిటల్ రూపాయిని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వీటి వాల్యూ ఫిజికల్ రూపాయికి సమానంగా ఉంటుంది.
డిజిటల్ రూపాయి ఫీచర్లు..
1డిజిటల్ రూపాయిని ఆర్‌బీఐ ఇష్యూ చేస్తుంది. అందువలన ఈ సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లో డిజిటల్ రూపాయిని లయబిలిటీ (ఒక విధంగా అప్పు లేదా బాధ్యత లాంటిది) గా చూపిస్తారు.
2 డిజిటల్ రూపాయిని కచ్చితంగా పేమెంట్ల కోసం అంగీకరించాలి. లీగల్ టెండర్‌గా గుర్తించాలి. ప్రజలు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు డిజిటల్ రూపాయిని స్టోర్ చేసుకున్నా వీటి వాల్యూలో మార్పు ఉండకూడదు.
3 క్యాష్, కమర్షియల్ బ్యాంక్‌ల మనీతో డిజిటల్ రూపాయిని ఈజీగా మార్చుకోవచ్చు.
4 డిజిటల్ రూపాయిని హోల్డ్ చేయడానికి యూజర్లకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. క్యాష్ మాదిరే స్టోర్ చేసుకోవచ్చు.
5 డిజిటల్ రూపాయి వలన కరెన్సీని ఇష్యూ చేయడానికి అయ్యే ఖర్చు, ట్రాన్సాక్షన్ల ఖర్చు తగ్గుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.
రెండు రకాల సీబీడీసీలు..
రెండు రకాల డిజిటల్ రూపాయిలను ఆర్‌బీఐ ఇష్యూ చేయనుంది. సాధారణ ప్రజలు లేదా రిటైలర్లు వాడుకోవడానికి (సీబీడీసీ–ఆర్) ను, నిర్ధిష్టమైన ఫైనాన్షియల్ సంస్థలు వాడేందుకు హోల్‌సేల్ (సీబీడీసీ–డబ్ల్యూ) ని ఆర్‌బీఐ తీసుకురానుంది. రిటైల్ సీబీడీసీని ప్రజలు, ప్రైవేట్ సెక్టార్, నాన్ ఫైనాన్షియల్ సంస్థలు, బిజినెస్‌లు వాడతాయి. ఈ డిజిటల్ రూపాయి రిటైల్ ట్రాన్సాక్షన్ల కోసం ప్రధానంగా తీసుకొస్తున్నారు. క్యాష్‌కు డిజిటల్ రూపంగా సీబీడీసీ–ఆర్ పనిచేస్తుంది. అదే హోల్‌సేల్ డిజిటల్ రూపాయిని ఫైనాన్షియల్ సంస్థల ఇంటర్‌బ్యాంక్ (బ్యాంకులు బ్యాంకులకు మధ్య) సెటిల్‌మెంట్స్ కోసం వాడతారు. ‘ఆర్‌బీఐకు డైరెక్ట్ లయబిలిటీగా ఉంటుంది కాబట్టి రిటైల్ సీబీడీసీ పేమెంట్స్, సెటిల్‌మెంట్స్‌కు సేఫ్‌గా పనిచేస్తుందని నమ్ముతున్నాం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను మరింత సమర్ధవంతంగా సెటిల్ చేయడానికి హోల్‌సేల్ డిజిటల్ రూపాయితో వీలుంటుంది. ఇవి ఆఫర్ చేసే బెనిఫిట్స్‌తో ఈ రెండింటిని అందుబాటులోకి తేవడం వలన ప్రయోజనాలు ఉన్నాయి’ అని ఆర్‌బీఐ తన కాన్సెప్ట్ నోట్‌లో పేర్కొంది.
డిజిటల్ కరెన్సీకి డిజిటల్ రూపాయి మధ్య తేడా..
‘ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న డిజిటల్ మనీతో పోలిస్తే సీబీడీసీ భిన్నమైంది. సీబీడీసీ రిజర్వ్ బ్యాంక్‌కు లయబిలిటీగా ఉంటుంది. కమర్షియల్ బ్యాంకులకు కాదు’ అని వీటి మధ్య తేడాను వివరిస్తూ ఆర్‌బీఐ పేర్కొంది.
సీబీడీసీ తేవడానికి గల కారణాలు..
- డిజిటల్ రూపాయితో క్యాష్‌ను మేనేజ్ చేయడంలో అయ్యే ఖర్చును తగ్గించొచ్చు.
- క్యాష్ లెస్ ఎకానమీని మరింతగా ముందుకు తీసుకెళ్లొచ్చు.
- పేమెంట్ సిస్టమ్‌లో పోటీతత్వాన్ని, సమర్ధతను, ఇన్నొవేషన్‌ను పెంచొచ్చు.
- ఇతర దేశాలకు చేసే ట్రాన్సాక్షన్లను మరింత మెరుగ్గా జరపడానికి వీలుంటుంది.
- అందరికీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తీసుకురావొచ్చు.
- క్రిప్టో కరెన్సీలపై చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అసెట్లకు బదులు దేశ కరెన్సీపైనే ప్రజల నమ్మకాన్ని పెంచడానికి డిజిటల్ రూపాయితో వీలుంటుంది.
ఆర్‌బీఐ సీబీడీసీని ఎందుకు తెస్తోందంటే?
సీబీడీసీ లేదా డిజిటల్ రూపాయి ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీని భర్తీ చేయదని, దీనికి అదనంగా ఒక ఆప్షన్‌గా పనిచేస్తుందని ఆర్‌బీఐ వివరించింది. డిజిటల్ రూపాయితో దేశ డిజిటల్ ఎకానమీ మరింత విస్తరిస్తుందని, పేమెంట్ సిస్టమ్ మరింత సమర్ధవంతంగా మారతుందని, అందరికి ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లు అందుబాటులోకి రావడం మెరుగవుతుందని అభిప్రాయపడింది.
డిజిటల్ కరెన్సీ, క్రిప్టోకి మధ్య తేడా..
క్రిప్టో కరెన్సీల వాడకం పెరిగితే మనీ లాండరింగ్ ఎక్కువవుతుందని, టెర్రరిజంకు ఆర్థిక సాయం పెరుగుతుందని ఆర్‌బీఐ ముందు నుంచి చెబుతూ వస్తోంది. క్రిప్టోలు దేశ ఆర్ధిక వ్యవస్థకు చేటుగా మారతాయని హెచ్చరిస్తోంది. క్రిప్టోలకు ఎటువంటి అండర్‌లైంగ్ వాల్యూ (వీటి వాల్యూ ఎటువంటి ఫిజికల్ అసెట్స్ నుంచి లెక్కించరు) ఉండదు. ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా క్రిప్టోలకు బాధ్యత వహించదు. అదే డిజిటల్ రూపాయి తెస్తే ప్రజలు వర్చువల్ కరెన్సీ అనుభవాన్ని ఎటువంటి రిస్క్ లేకుండానే పొందొచ్చు. క్రిప్టోల్లో ఉండే అసాధారణ వోలటాలిటీ నుంచి ప్రజలను రక్షించొచ్చు.