అమృత్​ 2.0 స్కీమ్​ కింద కొత్త మాస్టర్​ ప్లాన్​

అమృత్​ 2.0 స్కీమ్​ కింద కొత్త మాస్టర్​ ప్లాన్​
  • ఉమ్మడి జిల్లాలో పైలెట్​ ప్రాజెక్టుగా కొత్తగూడెం సెలెక్ట్​
  • డ్రోన్​తో డిజిటల్ ​సర్వే వచ్చే 50 ఏండ్లకు ఉపయోగపడేలా మాస్టర్ ​ప్లాన్ ​రూపకల్పన
  • సర్వే మొదలు పెట్టిన సర్వే ఆఫ్​ ఇండియా టీమ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :అమృత్​ 2.0 స్కీంలో భాగంగా డిజిటల్​ సర్వేకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కొత్తగూడెం టౌన్​ సెలెక్ట్​అయింది. వచ్చే 50 ఏండ్లకు ఉపయోగపడేలా మాస్టర్​ ప్లాన్​ను రూపొందించనున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది సాయంగా  సర్వే ఆఫ్​ ఇండియా టీమ్​ శనివారం నుంచి మాస్టర్ ​ప్లాన్ ​రూపకల్పనలో భాగంగా డిజిటల్​సర్వేను చేపట్టింది. ఇది మూడు రోజుల పాటు కొనసాగనుంది. 

పట్టణంలో లక్షకుపైగా జనాభా..

సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందు తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలోనే బొగ్గు బావులు విస్తరించి ఉన్నాయి. ఈ క్రమంలోనే సింగరేణి హెడ్డాఫీస్​ను కొత్తగూడెంలోనే ఏర్పాటు చేశారు. బొగ్గు బావుల్లో పనిచేసే వారు ఎక్కడ పడితే అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 

ప్రస్తుతం లక్షకు పైగా జనాభా కొత్తగూడెం టౌన్​లో ఉంది. కానీ 50 ఏండ్ల నాటి మాస్టర్​ ప్లాన్​నే ఆఫీసర్లు అమలు చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత1974లో  మాస్టర్​ ప్లాన్​ ను రూపొందించారు. మధ్య మధ్యలో మాస్టర్​ ప్లాన్​ అంటూ ఆఫీసర్లు హడావుడి చేసినా సమగ్రమైన మాస్టర్​ ప్లాన్​ ను మాత్రం రూపొందించలేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం పట్టణం అమృత్​ 2.0 స్కీమ్​కు సెలెక్ట్​ కావడంతో వచ్చే 50 ఏండ్లకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం సాయంతో సెంట్రల్​ గవర్నమెంట్​ డిజిటల్​ మాస్టర్​ ప్లాన్​ను రూపొందించే పనికి శ్రీకారం చుట్టింది. 

ఇరుకు రోడ్లు, అడ్డదిడ్డంగా నిర్మాణాలు..

జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత కొత్తగూడెంలో ట్రాఫిక్​ రద్దీ పెరిగింది. వెహికల్స్​ పెరిగాయి. పార్కింగ్​​ జోన్లు లేక రోడ్లపైనే వెహికల్స్​ను పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరో వైపు అడ్డదిడ్డంగా ఇండ్లు, కమర్షియల్​ నిర్మాణాలు జోరుగా సాగాయి. ఎంజీ రోడ్​ నుంచి చిన్న బజార్​, అక్కడి నుంచి పెద్ద బజార్​కు, లేపాక్షి హోటల్​ రోడ్​ నుంచి ఎంజీ రోడ్​కు వెళ్లేందుకు ప్రజల సౌకర్యార్థం దశాబ్దాల కాలం నాడు గల్లీలను ఏర్పాటు చేశారు. టౌన్​ప్లానింగ్​ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉండడంతో ఎవరికి వారు చాలా వరకు గల్లీలను ఆక్రమించుకున్నారు.

 రెసిడెన్షియల్​ప్రాంతాలు కమర్షియల్​ జోన్​లుగా మారాయి. ఏదేని అగ్ని ప్రమాదం జరిగితే కొన్ని ప్రాంతాలకు ఫైరింజన్​ కూడా పోలేని దుస్థితిలో రోడ్లున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐదు దశాబ్దాలకు సరిపోయే విధంగా సర్వే ఆఫ్​ ఇండియా టీమ్​మాస్టర్​ ప్లాన్​కు రూపకల్పన చేస్తోంది. ఎక్కడెక్కడ రెసిడెన్షియల్​ ఏరియాలు, కమర్షియల్​ ప్రాంతాలు, చెరువులు, ఖాళీ స్థలాలతో పాటు అగ్రికల్చర్​ ల్యాండ్స్​ లాంటి పలు అంశాలను డిజిటల్​ సర్వేలో గుర్తించనున్నారు.