- ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కారు ప్రణాళిక
- ఎవరికీ భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తు
- ప్రభుత్వ, అటవీ, వక్ఫ్, ఎండోమెంట్ భూములకూ కంచెలు
హైదరాబాద్, వెలుగు: ప్రతి రెవెన్యూ గ్రామానికి డిజిటల్సర్వే మ్యాప్‌ను తీసుకొచ్చేలా రాష్ట్ర సర్కార్కసరత్తు చేస్తున్నది. ఆయా గ్రామాల్లో ఏ సర్వే నంబర్ఎలా విస్తరించి ఉందనే వివరాలతో మ్యాప్‌ను రెడీ చేయాలని భావిస్తున్నది. గ్రామంలో ప్రతి రైతు వ్యవసాయ భూమికి సంబంధించి.. సర్వే నంబర్లు, బై సర్వే నంబర్లతో ఇంకో మ్యాప్‌ను నక్ష మాదిరిగా ఉండేలా చూడనున్నారు. దీంతో భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో సరిహద్దు గొడవలు తగ్గుతాయని, ఎవరిది ఏ భూమి అనే క్లారిటీ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ భూములు, అటవీ, వక్ఫ్, ఎండోమెంట్ భూములు కూడా ఎంత వరకు విస్తరించి ఉన్నాయి ? వాటికి కంచెలు ఎక్కడ వరకు ఏర్పాటు చేయవచ్చు అనేదానిపైనా స్పష్టత వస్తుందని ప్రభుత్వం పేర్కొంటున్నది.
ఇప్పటికే ధరణిలో సమస్యల పరిష్కారాన్ని ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం.. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తరువాత డిజిటల్మ్యాప్లకు సంబంధించి పనిని మొదలుపెట్టనుంది. ఇందుకోసం శాటిలైట్ సర్వే చేయాలా? డిజిటల్సర్వే చేయాలా? ఇంకా ఇతర మార్గాలు ఏమున్నాయనే దానిపై అధికారులు స్టడీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా భూముల సమగ్ర సర్వే చేశారా? కేంద్రం నుంచి ఉన్న ప్రతిపాదనలు ఏమిటి ? అనే వాటిని కూడా తెప్పించుకుని చూస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం 2024 కు సంబంధించి రెడీ చేసిన ముసాయిదా బిల్లులోనూ సర్వే మ్యాప్‌లను ప్రభుత్వం ప్రస్తావించింది.
ధరణిలో ఒక భూమిని అమ్మాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. ఆయా భూములకు సంబంధించి సరిహద్దులతో కూడిన సర్వేమ్యాప్లు పెట్టాలనే నిబంధనను పేర్కొన్నది. ఆర్ఓ ఆర్ –2024 చట్టానికి రూపం వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో.. వచ్చే ఏడాదిలో సమగ్రంగా ఏ ఊరికి ఆ ఊరిలో డిజిటల్ సర్వే మ్యాప్‌లను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాల్లో చేసి.. హద్దులు పాతి వాటికి డిజిటల్ కో ఆర్డినేట్స్, మ్యాప్ ఇవ్వనున్నారు. అందులో ఇబ్బందులు ఏమైనా ఉంటే సరిచూసుకుని వాటి ఆధారంగా తరువాత పూర్తి స్థాయిలో సమగ్ర భూసర్వే చేయనుంది.
భూముల గొడవలన్నీ సరిహద్దుల దగ్గరే..
రాష్ట్రంలో భూముల సమస్యలు, గొడవలన్నీ సరిహద్దుల దగ్గరే జరుగుతున్నాయి. చివరకు అవి హత్యలకు దారితీస్తున్నాయి. ధరణిలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అప్లికేషన్లలో ఆయా సర్వే నంబర్లలో విస్తీర్ణం సరిపోలనివే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. రికార్డుల్లో ఒక విస్తీర్ణం ఉండగా.. చివరకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమి మాత్రం కొంత అటు ఇటుగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో భూ సమస్యలు అంతకంతకు పెరగడంతో పాటు రైతుల మధ్య తగాదాలకు దారితీస్తున్నాయి. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా భూ సమగ్ర సర్వే చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధులు కూడా కేటాయించింది. కానీ, కొంతకాలానికి పక్కన పెట్టింది.
ప్రస్తుతం1936లో (84 ఏండ్ల క్రితం) నిజాం పరిపాలనలో చేసిన భూసర్వేనే ప్రామాణికంగా, నాటి వివరాల ఆధారంగానే దస్త్రాలు కొనసాగుతున్నాయి. కాలంతో పాటు భూ యజమానులు కూడా మారుతూ రాగా.. భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి. సాగు విస్తీర్ణం, నివాస ప్రాంతాలు అనూహ్యంగా పెరిగాయి. వాగులు, వంకలు, చెరువులు, కొండలు, గుట్టలు, ఇతర వనరుల భౌతిక రూపం పూర్తిగా మారిపోయింది. నాటి సర్వే దస్త్రాల్లో ఫలానా కొండ పక్కన అని మొదలు పెట్టి హద్దును సూచించేవారు.
చాలా ప్రాంతాల్లో కొండలు కరిగిపోవడం, క్రయవిక్రయాలు, పంపకాలతో భూమి చేతులు మారింది. భూసర్వే నంబర్ల పక్కన బైనంబర్లు పెరిగిపోయాయి. దస్త్రాల్లో నమోదైన విస్తీర్ణం కూడా క్షేత్రస్థాయి కన్నా పెరిగింది. భూ వివాదాటూ పెరిగిపోయాయి. ప్రస్తుతం ధరణి నిర్వహణ బాధ్యతల మార్పు, కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా–2024, గ్రామాల్లో విలేజ్పబ్లిక్ ఆఫీసర్లను నియమించడం వంటి రెవెన్యూ సంస్కరణల సందర్భంగా సర్వే సాధ్యాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
విలేజ్ యూనిట్‌గా, దశల వారీగా
రాష్ట్రంలో విలేజ్ నుయూనిట్గా తీసుకుని.. దశల వారీగా సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నది. దీంతో ఏయే సర్వే నంబర్లలో సర్వే చేస్తున్నారో ముందే ప్రకటించి.. ఆయా భూ యజమానులకు ముందే సమాచారం ఇవ్వడం ద్వారా సర్వేను పూర్తి చేయవచ్చని భావిస్తున్నది. అయితే, రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికే ప్రతి మండలంలో భూముల సర్వే కోసం రైతులు అందజేసిన దరఖాస్తులు వందల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్ శాంక్షన్ పోస్టులు 476 ఉండగా.. ప్రస్తుతం 142 మంది మాత్రమే విధులు నిర్వర్తి స్తున్నారు. 334 పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఇక మండల సర్వేయర్ పోస్టులు పాత జిల్లాల ప్రాతిపదికన 350 ఉండగా.. ప్రస్తుతం విధుల్లో 320 మంది మాత్రమే ఉన్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య పెరిగినా శాంక్షన్డ్ పోస్టులు పెరగలేదు. దీంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వా మ్యంలో సర్వే చేయలనేదానిపైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
భూ యజమాని సమక్షంలోనే డీజీపీఎస్ సర్వే!
రాష్ట్రంలో దాదాపు లక్ష కిలోమీటర్ల భూ విస్తీర్ణం ఉంది. నీటి వనరులు, అడవులు తీసివేస్తే వ్యవసాయం ఇతర భూముల సర్వే చేపట్టాల్సి ఉంటుంది. సర్వేకు కనీసం ఆరు నెలల నుంచి రెండేండ్ల సమయం పట్టే అవకాశాలున్నాయి. సాంకేతిక యంత్రాలు, మానవ వనరులు, తదితర ఖర్చులు కలుపుకుని రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. భూ సర్వే కోసం డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం -(డీజీపీఎస్), డిజిటల్ పట్టాలతో లైడార్ సర్వే, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే తదితర పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్ పద్ధతుల కోసం ప్రభుత్వం చూస్తున్నది. భూ యజమాని సమక్షంలోనే డీజీపీఎస్ సర్వే చేస్తే.. ప్రజల మద్దతు కూడా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతిలోనే వీలైనంత త్వరగా పూర్తిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు.