గోదావరిఖని, వెలుగు : దేశంలోని దాదాపు మూడు లక్షల మంది బొగ్గు గని కార్మికుల కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎస్) ఖాతా వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయనున్నామని సీఎంపీఎఫ్ సెంట్రల్ (ధన్‌బాద్) కమిషనర్ వీకే మిశ్రా తెలిపారు. అతి త్వరలో ఒక యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని, దీనివల్ల ప్రతీ కార్మికుడికి తన సెల్‌ఫోన్‌లోనే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బుధవారం గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్‌లో ఆర్జీ –1 ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అధ్యక్షతన సింగరేణి మేనేజ్‌మెంట్, యూనియన్ లీడర్లతో జరిగిన ట్రైపార్టియేటెడ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు చేసిన పని దినాల ఆధారంగానే 7 శాతం పీఎఫ్ వసూలు చేయాలన్న వినతిపై బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సింగరేణి సంస్థ డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ మాట్లాడుతూ సింగరేణి కంపెనీలో కార్మికులకు సీఎంపీఎఫ్ వివరాలను రిటైర్మెంట్ అయిన వెంటనే అందజేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. యూనియన్ల లీడర్లు మాట్లాడుతూ సీఎంపీఎఫ్ వడ్డీ రేటు పేమెంట్ చేయడంలో వ్యత్యాసం ఉంటుందని, దీనివల్ల రిటైర్డ్ కార్మికులకు, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు నష్టం జరుగుతుందని, వడ్డీ రేటు తగ్గకుండా చూడాలని కోరారు. మీటింగ్‌లో జీఎంలు కె.బసవయ్య(వెల్ఫేర్, ఆర్సీ), ఎ.కుమార్ రెడ్డి (ఈఈ అండ్ సీఎస్ఆర్), సుబ్బారావు(ఫైనాన్స్), సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరి పచౌరి, అసిస్టెంట్ కమిషనర్ కనకమ్మ, ఏజీఎం(ఐఆర్) కవితా నాయుడు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, బీఎంఎస్ ప్రెసిడెంట్ సత్తయ్య, సీఐటీయూ జనరల్ సెక్రటరీ నర్సింహారావు పాల్గొన్నారు.